ప్రజాశక్తి-పాడేరు: జిఒ-3 రిజర్వేషన్ సాధనకు యువత పోరాడకపోతే నిరుద్యోగ సమస్య ఎదుర్కోక తప్పదని, రిజర్వేషన్ సాధన ఉద్యమానికి గిరిజన యువత సిద్ధం కావాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పిఎంఅర్‌సిలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన యువతతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్ ఏరియాలో స్థానిక గిరిజనులకు 100 శాతం ఉద్యోగ నియామక పదోన్నతుల జిఒ-3ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. జిఒ-3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని గిరిజనుల పోరాటానికి తలొగ్గిన ప్రభుత్వం టిఎసిలో తీర్మానం చేసినప్పటికీ కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర అసెబ్లీలో తీర్మానం చేయకుండా గిరిజనుల ఉద్యోగావకాశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మరో పక్క జిఒ-3 రిజర్వేషన్ స్ఫూర్తికి విరుద్ధంగా గిరిజనేతరులకు ఉపాద్యాయ ప్రమోషన్స్ ఇవ్వడానికి అదేశాలు జారీ చేయడం అన్యాయమన్నారు. సుప్రీం తీర్పును పున్ణపరిశీలించాలని కోరుతూ జిఒ-3 సాధన కమిటీ తరుపున గిరిజన సంఘంతో పాటు తెలంగాణ నుండి గిరిజనులు, సంఘాలు సుప్రీం కోర్టులో వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఒకసారి విచారణ నిర్వహించిందన్నారు. ప్రస్తుతం విచారణ పెండింగ్‌లో ఉండగా రంపచోడవరం ఐటిడిఎ పరిధిలో గిరిజనేతరుల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకోవడం గిరిజనులకు ద్రోహం చేయడమేనన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మరోపక్క గిరిజనులకు సంక్రమించిన 100శాతం రిజర్వేషన్ హక్కులను కాలరాస్తూ ఆదేశాలు జారీ చేయడం జగన్ ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. గిరిజనుల ప్రయోజనాలపై ప్రభుత్వం నాటకాలను యువత ఎండ గట్టాలని పిలుపునిచ్చారు. గిరిజనుల ఉద్యోగ అవకాశాల జిఒ-3 రిజర్వేషన్ సాధనకు పోరాటంలో గిరిజన ఎమ్మెల్యేలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వివిధ శాఖల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పోస్టులను గిరిజనేతరులతో భర్తీ చేస్తున్నప్పటికీ గిరిజన ఎమ్మెల్యేలు కనీసం స్పందించక పోవడం గిరిజనుల రిజర్వేషన్ పై ఎమ్మెల్యేలకు ఉన్న చిత్తశుద్ధి తేటతెల్ల మవుతోందన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో 100శాతం ఉద్యోగ నియమక, ప్రమోషన్‌లు స్థానిక గిరిజనులకే కల్పించాలని గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లు చట్టంగా మారితే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు నిర్వాసితులగా మారి అడవి నుండి గెంటి వేయబడతారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.సుందరరావు, కె.నరసయ్య, మాతృ భాష విద్యా వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీను, జిల్లా కార్యదర్శి సర్బునాయుడు, అధ్యక్షురాలు పి.కుమారి, రాష్ట్ర నాయకులు చిట్టిబాబు, సతీష్, గణేశ, చిన్ని, సరస్పతి, నగేష్ పాల్గొన్నారు.










