Dec 20,2022 23:14

ప్రజాశక్తి-విజయవాడ: ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరంచకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. డీజిల్‌ ఆటోలను గ్యాస్‌ ఆటోలుగా మార్చాలని, ఆటో, గ్యాస్‌ బండల క్లీనింగ్‌ సెంటర్‌ను విజయవాడలో ఏర్పాటు చేయాలని, వేలాది రూపాయలు జరిమానాలను విధించే జీఓ నెంబర్‌ 21ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా రోజురోజుకీ ఆటో, మోటార్‌ కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆటో మోటార్‌ కార్మికులను ఆదుకోవాల్సింది పోయి అనేక రూపాల్లో సమస్యలు సష్టిస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరంలో 1500కు పైగా ఉన్న డీజిల్‌ ఆటోలను గ్యాస్‌ ఆటోలుగా మార్చాలని, ఆటో గ్యాస్‌ బండల క్లీనింగ్‌ సెంటర్‌ విజయవాడలో ఏర్పాటు చేయాలని, వేలాది రూపాయలు జరిమానాలు విధించే జిఒ 21 రద్దు చేయాలని గతంలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా వారు స్పందించలేదన్నారు. ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు మాట్లాడుతూ ఆటో గ్యాస్‌ బండల క్లీనింగ్‌ చేయించుకోవాలంటే హైదరాబాద్‌, మధిర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. దీని వల్ల ఆటో కార్మికులపై అదనపు భారం పడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విజయవాడ తూర్పు సిటీ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బి. రూబెన్‌ కుమార్‌ అధ్యక్షత వహించగా విజయవాడ సిటీ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ సెంట్రల్‌ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం.హనుమంతరావు, నగర నాయకులు డి.కోటయ్య, పి.తిరుపతయ్య, డి. కాళేశ్వరరావు, విజ్జి చిన్నారావు, బి.పైడిరాజు, డి.నూకరాజు, బి.ప్రసాద్‌, జి.శ్రీనివాసరావు, ఎస్‌.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.