Jan 08,2023 21:51

ప్రజాశక్తి - ఏలూరు
          జిఒ1ని రద్దు చేయాలని ఐలు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఐలు జిల్లా అధ్యక్షురాలు ఓరుగంటి శైలజ మాట్లాడుతూ సభలు, సమావేశాలకు పోలీసులు రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలా కాకుండా ప్రజల, పార్టీల, సంఘాల ప్రజాస్వామ్య హక్కు రద్దు చేయాలని చూడటం సరికాదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ప్రదర్శనలు, సభలు రోడ్ల మీద జరపరాదంటూ విడుదల చేసిన జిఒ 1ని రద్దు చేయాలని, ఇది ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుని సమస్య కాదని అన్నారు. బిజెపి ఈ దుర్మార్గ జిఒను ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ బలపరచడం దారుణమన్నారు. 1861 నాటి బ్రిటిష్‌ చట్టం ఆధారంగా ఈ జిఒ విడుదల చేయడం బాధాకరమన్నారు. సిపిఐ జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి తప్ప వేరే ఎవరూ ప్రదర్శనలు, సభలు జరపరాదనే విధంగా జిఒ లక్ష్యంగా ఉందన్నారు. అందరూ కలిసి ఈ చీకటి జిఒ రద్దుకోసం నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ఐలు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏలూరు నగర కార్యదర్శి గెద్దా విజయభాస్కర్‌, నగర నాయకులు పి.వెంకట్‌, కాంగ్రెస్‌ నాయకులు ఆర్‌.రామ్మోహన్‌రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, టిడిపి నాయకులు దాసరి ఆంజనేయులు, జనసేన నాయకులు ఎన్‌కెసి.నరేష్‌, ఆలిండియా దళిత రైట్స్‌ ఫోరమ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు అర్‌.మణిసింగ్‌, ఐలు నాయకులు కూన కృష్ణారావు, వై.మణికంఠతేజ, జి.రాజా, సిఐటియు నాయకులు కె.విజయలక్ష్మి, జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ కమిటీ సభ్యులు మేతర అజరుబాబు, టిడిపి లీగల్‌ అడ్వైజర్‌ జె.ప్రసాద్‌, జెవివి సమత జిల్లా కన్వీనర్‌ ఎం.తేజశ్రీదేవి, నాయకులు బి.శ్రీనివాసరావు, వికలాంగుల సంఘం నాయకులు పి.రఘురాం, కాంగ్రెస్‌ నేత ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భీమడోలు:భావ ప్రకటన స్వేచ్ఛను హరించే జిఒ 1ని రద్దు చేయాలంటూ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో ఆదివారం పాతూరు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ గోదాముల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిఒ కాపీలను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు మాట్లాడుతూ ఈ జిఒ అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వప్రజావ్యతిరేకతను అణిచివేసేందుకు ప్రవేశపెట్టిందని, దాన్ని తిరిగి ప్రస్తుత సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేయడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గడ్డి సూర్యారావు, మత్తే ప్రసాద్‌, పి.ప్రసాద్‌, వై.శ్రీను పాల్గొన్నారు.