Jul 17,2023 00:06

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-గుంటూరు : గతేడాది 3, 4, 5 తరగుతల విలీనానికి గురైన ప్రాథమిక పాఠశాలలు తల్లిదండ్రుల ఆదరణకు దూరమై త్వరలో మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు ఆందోళన వెలిబుచ్చారు. ఆయా ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల్ని చేర్చడానికి తల్లిదండ్రులు ఇష్టపడక ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్నారని, తక్షణమే జిఒ 117ని రద్దు చేసి ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి అయిదు తరగతులు కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు బి.ఆదిలక్ష్మి అధ్యక్షతన ఆదివారం యుటిఎఫ్‌ జిల్లా ఆఫీసు బేరర్స్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గటానికి ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరమై ప్రైవేటు పాఠశాలల్లో చేరుతుంటే ప్రభుత్వం వేలకోట్లు నాడు-నేడుకు ఖర్చు చేసి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడి చేస్తూ, బెదిరించటం వల్ల విద్యారంగంలో మెరుగైన ఫలితాలు రావని అధికారులు తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా విద్యావేత్తలతో, మేథావులు, ఎమ్మెల్సీలు, సంఘాలతో చర్చించి, ఉపాధ్యాయుల్ని ప్రోత్సహిస్తూ వారిని భాగస్వాముల్ని చేయటం ద్వారా ప్రభుత్వ విద్యారంగం మెరుగుపడుతుందని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతల భారం విపరీతంగా పెరిగిపోయిందని, దీని ప్రభావం బోధనపై పడి పిల్లలకు నష్టం జరుగుతుందని అన్నారు. తక్షణమే బోధనేతర పనులను, అనవసరమైన శిక్షలను గందరగోళ విద్యా కార్యక్రమాలను రద్దుచేసి, స్పష్టమైన విద్యా విధానాన్ని రూపొందించి, ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షులు ఎ.ఎస్‌.కుసుమకుమారి, ఐక్య ఉపాధ్యా పత్రిక సంపాదకులు ఎస్‌.కుమార్‌రాజా, రాష్ట్ర ప్రచురణల కమిటీ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎఎల్‌.శివపార్వతి, ఎమ్‌డి దౌలా పాల్గొన్నారు.