
ప్రజాశక్తి - కురుపాం : గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జిఒ 117 అమలు చేస్తే సహించబోమని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు టి.రమేష్ అన్నారు. శనివారం కురుపాం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లోని పలు పాఠశాలలను సందర్శించి వాటి స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుపాం మండలంలో నేరేడువలస, తెనుఖర్జలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులతో పిల్లలు అందుతున్న విద్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గవర్నమెంట్ ప్రైమరీ పాఠశాలల్లో కనీసం బిల్డింగ్ కూడా లేదన్నారు. అలాగే 117 జీవో వల్ల హైస్కూల్లో ప్రాథమిక పాఠశాలలు కలిసిన తర్వాత డ్రాపౌట్ చాలా పెరిగాయన్నారు. నాడు-నేడు పథకం కింద లక్షలు ఖర్చుపెట్టి ప్రాథమిక పాఠశాలలను సుందరంగా తీర్చినదిద్దిగా ఆ భవనాలన్నీ పిల్లలు లేక ఖాళీగానే ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు కూడా ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారని, దీనివల్ల ప్రభుత్వ సొమ్ము నిరుపయోగంగా ఉందని తెలిపారు. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మెనూ రేట్లు, మెనూకిచ్చే డబ్బులు చాలీచాలనివిగా ఉన్నాయని తెలిపారు. వీటిన్నింటినీ పరిశీలించామని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.