May 13,2023 00:58

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో తీసుకొచ్చిన జిఒ 1ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేయటంపై యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన సంఘ సమాశంలో ఆయన మాట్లాడుతూ జిఒ 1 పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని కోర్టు ప్రకటించటం ప్రజాస్వామ్య విజయమన్నారు. అదే విధంగా సభలు, ప్రదర్శనలు జరుపుకోవటం, నిరసన తెలపటం లాంటి హక్కులను ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్భంద విధానాలు విడనాడి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు ఎం.గోవిందు, జి.వెంకటేశ్వరరావు, ఎం.గురుబ్రహ్మం పాల్గొన్నారు. జిఒ 1ను హైకోర్టు రద్దుపై సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : జీవో 1ని హైకోర్టు కొట్టి వేయటం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కల సాకారమైందని టిడిపి నాయకులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు స్థానిక ఎన్‌టిఆర్‌ భవన్‌ వద్ద బాణసంచా కాల్చడంతోపాటు జీవో కాపీలను దహనం చేశారు. నాయకులు సయ్యద్‌ పెద కరిముల్లా, పి.వెంకట కోటయ్య, మస్తాన్‌వలి, ఎ.నాగేశ్వరరావు, పి.పెద్దిరాజు, ఎన్‌.పాపారావు, వెంకటరాఘవ, రామమల్లేశ్వరరావు పాల్గొన్నారు.