Mar 20,2023 22:43

ప్రజాశక్తి - ఏలూరు
             జిఒ నెం.1ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాలు తలపెట్టిన చలో విజయవాడకు తరలివెళ్తున్న వారిపై పోలీసు నిర్బంధం ప్రయోగించడాన్ని ఖండిస్తూ స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ప్రజాసంఘాలు, వామపక్షాల నేతలు సోమవారం మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. సిపిఎం నగర కార్యదర్శి పి.కిషోర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్నుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ బండి వెంకటేశ్వరరావు, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి కాకి నాని, ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి వి.శైలజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కడానికి జిఒ నెం.1 తెచ్చిందని విమర్శించారు. బ్రిటీష్‌ ప్రభుత్వ హయాంలో తెచ్చినటువంటి ఈ జిఒను వైసిపి ప్రభుత్వం అమలు చేయాలనుకోవడం దారుణమన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజయవాడ వెళ్తుంటే ఇళ్ల వద్దే అడ్డుకోవడాన్ని ఖండించారు. జిఒ నెం.1ని తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి.రామకృష్ణ, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సిఐటియు నాయకులు బి.జగన్నాథరావు, జి.గోపి, వైఎస్‌.కనకారావు, వివిఎన్‌.ప్రసాద్‌, ఎం.ఇస్సాక్‌, రవీంద్ర, జి.కోటేశ్వరరావు, ఏసుబాబు, సిపిఐ నాయకులు బల్ల కనకదుర్గారావు, గేదెల నాగేశ్వరరావు, గురవయ్య, గుబ్బల ప్రభాకర్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు కాకర్ల అప్పారావు, పిడిఎస్‌యు నాయకులు క్రాంతి, వినోద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌బాబు, చేతివృత్తిదారుల జిల్లా కన్వీనర్‌ పి.ఆదిశేషు పాల్గొన్నారు.
కుక్కునూరు: జిఒ నెం.1ని తక్షణం రద్దు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం, సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపంధా ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్‌ ప్రమద్వరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాటా ్లడారు. కార్యక్రమంలో నేతలు కల్లయ్య, కొండా ప్రసాద్‌, శ్రీను, మహబూబ్‌పాషా, వలీపాషా పాల్గొన్నారు.
రైతుసంఘం నేత నర్సింహ అరెస్టు
నూజివీడు రూరల్‌: జిఒ నెం.1ని రద్దు చేయాలని చలో విజయవాడకు బయల్దేరిన ఎపి రైతుసంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహను పోలీసులు అరెస్టు చేసి రూరల్‌ స్టేషన్‌కు తరలించారు.