Jan 30,2023 23:22

గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అప్పలనర్స, గిరిజనులు

గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పలనర్స
కళ్లకు నలుపు గంతలు కట్టుకుని నిరసన
ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌:
ప్రజా ఉద్యమాలను అణిచివేయాలన్న దుర్బుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ1ని తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. సోమవారం అరకులోయ మ్యూజియం వద్ద మహాత్ముని వర్ధంతిని పురస్కరించుకుని, గాంధీజీ. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిఒ1 రద్దు చేయాలని నిరసనగా కళ్లకు నల్లబ్యాడీలను కట్టుకుని నిరసన చేపట్టారు
ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ కార్యవర్గసభ్యుడు పి అప్పలనర్స మాట్లాడుతూ 1861లో బ్రిటీషర్లు అమలు చేసిన పోలీస్‌ చట్టాన్ని ఇపుడు రాష్ట్రంలో అమలు చేయాలని జిఒ 1 జారీ చేయడం సిఎం జగన్‌, వైసిపి ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అణిచివేయడానికి లేనిపోని చట్టాలు,జిఒలను జారీ చేసి ప్రజలను భయపెట్టాలనుకోవడం దుర్మార్గమన్నారు.
ఏజెన్సీలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం, జిఒ3 రద్దు, గిరిజన హక్కులు, చట్టాల ఉల్లంఘనపై ప్రజా ఉద్యమాలు తీవ్రమౌతున్న పరిస్థితుల్లో వాటిని అణచివేయడానికి, లేదంటే పక్కదారి పట్టించడానికి, లేనిపోని ఆంక్షలు, అరెస్టులు, నిర్బంధాలను ప్రయోగిస్తూ, నాటి బ్రిటిష్‌ పాలకులను తలదన్నేలా ప్రజావ్యతిరేక పరిపాలనను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు అమలు, ఉద్యోగ భద్రత, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాల కల్పన వంటి డిమాండ్ల సాధనకు ఉద్యోగ, కార్మికుల ఉద్యమాలను జిఒ1తో అడ్డుకోవాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పొద్దు బాలదేవ్‌, గిరిజన మ్యూజియం యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు రాజు, రాంబాబు, కన్నమ్మ, లక్ష్మీ రంభ, రాజు పాల్గొన్నారు