Jan 06,2023 00:09

నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-అనకాపల్లి
రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్‌ షోలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెంబర్‌ 1ను నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన గురువారం స్థానిక నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో జిఒ కాపీలను దగ్ధం చేశారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకొని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరికి సిపిఎం నాయకులు పోలీసు చర్యలను ప్రతిఘటించి జిఒ 1 కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు స్వేచ్చగా తమ అభిప్రాయాలను వెలుబుచ్చే అవకాశం ఉందన్నారు. వీటిపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రజల హక్కులపై దాడి చేసే ఈ జిఒ 1ను తక్షణమే వెనక్కు తీసుకోకపోతే పోరాటాలకు వెనుకాడమని హెచ్చరించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లోనే గతంలో జగన్మోహన్‌ రెడ్డి లక్షలాది మందితో సభ నిర్వహించడం గుర్తుకు లేదా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా, ప్రజాస్వామ్య హక్కులపై దాడులు చేస్తే చంద్రబాబుకు పట్టిన గతే జగన్మోహన్‌ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌.శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి జిఒలు జారీ చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వివి శ్రీనివాసరావు, తేలయ్య బాబు, సుభాషిణి, ఉమామహేశ్వరరావు, నూక అప్పారావు, చలపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
కె.కోటపాడు : జీవో నెంబర్‌ వన్‌ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని సిపిఎం మండల నాయకులు రొంగలి ముత్యాల నాయుడు, ఎర్ర దేవుడు పేర్కొన్నారు. గురువారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి తప్పుడు జీవోలు తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు రోడ్డుపైనే ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు.