తగరపువలస అవంతి, కొమ్మాది చైతన్య కాలేజీల సందర్శన
ప్రజాశక్తి-పిఎం.పాలెం/ తగరపువలస : నగరంలోని పలు విద్యాసంస్థలలో జిన్నా చిత్రయూనిట్ సందడి చేసింది. మంచు విష్ణు కథానాయకుడిగా 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించిన జిన్నా సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, తగరపువలస అవంతి విద్యాసంస్థలను సందర్శించారు. జిన్నా సినిమా హీరో మంచు విష్ణు, కథానాయిక పాయల్ రాజ్‌పుత్ కోన వెంకట్, జబర్థస్త్ ఫేమ్ చమ్మక్ చంద్రలతో కలిసి కళాశాలలో సందడి చేశారు. ఈనెల 21న విడుదల కానున్న జిన్నా సినిమాను ప్రతి ఒక్కరూ అదరించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లతో విద్యార్థులు సెల్ఫీలు దిగి, వారితో కరచాలనం చేసేందుకు విద్యార్థులు ఎగబడ్డారు. హీరో విష్ణు, హీరోయిన్ రాజ్ పుత్,కోన వెంకట్, చమ్మక్ చంద్రలను చైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో విద్యాసంస్థల అధిపతి మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, తగరపువలస అవంతి కాలేజీలో ఎమ్మెల్యే, అవంతి విద్యాసంస్థల అధిపతి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించి, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. జిన్నా సినిమా మంచి ప్రజాదరణతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చైతన్య కాలేజీలో ఫైనాన్స్ డైరెక్టర్ మాధవి, ప్రిన్సిపాల్ కే సురేష్ తదితరులు పాల్గొన్నారు.










