Oct 28,2022 23:14

ప్రజాశక్తి - విజయవాడ : జింఖానా గ్రౌండ్స్‌లో ఈనెల 23న జరిగిన దీపావళి మందుగుండు సామాను పేలుడు ఘటన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించడంతోపాటు 15, 16, 17వ నంబరు దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటనపై సత్యనారాయణపురం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా ఆదేశాలమేరకు, టాస్క్‌ఫోర్స్‌ ఎడిసిపి, వెస్ట్‌ డిసిపి కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన నార్త్‌ డివిజన్‌ ఎసిపిరమణ మూర్తి కేసు దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై పోలీసుల కథనం ఇలా ఉంది. బీసెంట్‌ రోడ్లో బట్టల వ్యాపారం చేసే వై.గోపాల కష్ణ మూర్తి, అతని స్నేహితుడు గోవిందరాజు జింఖానా గ్రౌండ్‌లో షాప్‌ నెంబర్‌ 16ను తీసుకుని లైసెన్సుడు సామాను కొనుగోలు చేశారు. తాడేపల్లిగూడెనకు చెందిన చిరతపూడి కిషోర్‌ కుమార్‌, రామాంజనేయులు వద్ద నుండి దేశీయంగా తయారైన 10 వేల చిచ్చుబుడ్లు (100 బ్యాగ్‌లు, 40 బ్యాగ్‌ల మతాబులు (ఒక్కో బ్యాగ్‌ 25 కిలోలు) కొనుగోలు చేసి వాటిని టాటా ఏస్‌లో ఈనెల 22వ తేదీ సాయంత్రం విజయవాడ తీసుకొచ్చారు. గోవిందరాజు వద్ద ఉన్న పాత మందుగుండు సామగ్రిని, నాలుగు బస్తాల ఉల్లిపాయల బాంబులను (అన్‌ లైసెన్డ్స్‌) షాప్‌లో ఫ్రేమ్‌ వెనుక ఉంచారు. వీరి వద్ద పనిచేసేందుకు నాంచారయ్య, రాధాకష్ణ, సాంబయ్య, ఉమామహేశ్వరరావు, బ్రహ్మమ్మయ్య, కాశయ్యలను నియమించుకున్నారు. ఈనెల 23న ఉదయం 6.30 గంటల సమయంలో బ్రహ్మయ్య, కాశయ్య షాప్‌ వెనుక భాగంలో, గోపాలకష్ణ, గోవిందరాజు ముందుభాగంలో ఫ్రేమ్‌లపై సరుకు సర్దుతున్నారు. రాధాకష్ణ, సాంబయ్య, ఉమామహేశ్వరరావు షాప్‌నకు బయట వైపు రేకులకు బోల్ట్‌లను బిగిస్తున్నారు. ఉదయం 7.30 గంటల సమయంలో నాంచారయ్య బయట ఉన్న సరుకును లోపలికి అందిస్తుండగా, కాశయ్య, బ్రహ్మయ్య లోపల సర్దుతున్న ఉల్లిపాయ బాంబులు గల బస్తా కిందపడి వత్తిడికి గురై పెద్ద శబ్దంతో పేలి మంటలు వ్యాపించాయి. పక్కనే బస్తాల్లో ఉన్న చిచ్చుబుడ్లు, మతాబులకు అంటుకొని అవి కూడా పేలి మంటలు చెలరేగాయి. గోపాలకష్ణ, గోవిందరాజు, నాంచారయ్య, రాధాకష్ణ, సాంబయ్య, ఉమామహేశ్వరరావు తదితరులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్య, కాశయ్య మరణించారు. ఇతరుల ప్రాణాలకు నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని తెలిసి కూడా పరిమితికి మించి అధిక మొత్తంలో మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచి ప్రమాదానికి కారణమైన గోపాలకష్ణ, గోవిందరాజులను, అలాగే పరిమితికి మించి సరఫరా చేసిన కిశోర్‌, రామాంజనేయులను ఈనెల 27న పోలీసులు అరెస్టు చేశారు.