ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
హిందుస్థాన్ జింక్ పరిశ్రమ (హెచ్‌జెడ్‌ఎల్)ను భూస్థాపితం చేసి వందల మంది కార్మికుల జీవనోపాధిని రోడ్డున పడేసి విశాఖపట్నంకు ద్రోహం చేసిన ఘన కార్యం బిజెపి దక్కించుకుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 1974లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హయాంలో ప్రభుత్వ రంగంలో విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో హిందుస్థాన్ జింక్ ఇండిస్టీ ఏర్పడింది. రూ.10 వేల కోట్లు రిజర్వు నిధులున్న ఈ సంస్థను 1991లో 10 శాతం, 1993లో 24 శాతం ఇతర ఫైనాన్స్ సంస్థలకు షేర్లను పాలకులు అమ్ముతూ వచ్చారు. 2002లో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాలు కలసి అమ్మకానికి శ్రీకారం చుట్టాయి. 26 శాతం షేర్లను రూ.445 కోట్లకు వేదాంత స్టెరిలైట్ కంపెనీకి బిజెపి 2002లో అమ్మేయగా... 2013లో 73 శాతం వాటాలను వేదాంతకు అమ్మేసింది. దీంతో జింక్ పరిశ్రమ విశాఖలో మాయమైంది. కాదు...కాదు...బిజేపియే మాయం చేసేసింది. ఈ విషయాన్ని కార్మికులు, ఉద్యోగులు, విశాఖ ప్రజలు నేటికీ చెప్పుకోవడం పరిపాటి. 2004 నుంచి జింక్‌లో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించారు. మొత్తం ఇలా 1800 మంది ఉద్యోగులను విఆర్‌ఎస్ ద్వారా వదిలించుకున్నారు. ఈ పరిశ్రమ కోసం నాటి రైతులు ఎకరాను రూ.850కే ఇచ్చేశారు. నేడు అదే ఎకరా రూ.150 కోట్లకు పైగా అమ్ముకునే యత్నాలకు బిజెపి నేతలు వేదాంత కంపెనీతో కలసి రియల్ వ్యాపారం చేస్తున్నారు. నాటి విశాఖ ఎంపీగా ఉన్న బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పాత్ర కూడా ఈ సేల్‌లో ఉందని ఉద్యోగులు చెబుతున్నారు.










