Nov 17,2022 23:06

మూర్చరోగులకు కిట్లు అందజేస్తున్న జిమ్‌సర్‌ వైద్యులు

ప్రజాశక్తి- మధురవాడ: గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్‌సర్‌) ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం జాతీయ ఎపిలిప్సీడే నిర్వహించారు. న్యూరాలజీ నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్నిజిమ్‌సర్‌ ప్రో వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బి.గీతాంజలి ప్రారంభించారు. గీతం న్యూరాలజీ నిపుణుడు డాక్టర్‌ విజయభాస్కర్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల జనాభా మూర్చ రోగంతో బాధపడుతున్నారని, వారిలో 80 శాతం మంది అభివృద్ది చెందుతున్న దేశాలలో ఉన్నారన్నారు. మన దేశంలో 10 మిలియన్ల జనాభా మూర్చ రోగంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మూర్చ రోగం ఉన్నవారికి పూర్తి వివరాలతో ముద్రించిన ప్రత్యేక కార్డులను అందజేస్తున్నామన్నారు. తద్వారా వారు ఆరుబయట పడిపోతే ఎవరైనా సాయపడే అవకాశం ఉందన్నారు. రోగి కుటుంబ సభ్యులు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిమ్‌సర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జ్యోతిపద్మజ, ఆసుపత్రి సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ రామాజనేయలు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ విఠల్‌, న్యూరాలజీ సీనియర్‌ డాక్టర్‌లు డాక్టర్‌ శిల్పా, డాక్టర్‌ దీప్తి పాల్గొన్నారు. మూర్చ రోగులకు ఉచితంగా మందులు కిట్‌లు అందజేసారు.