Apr 15,2023 23:51

జి.మేడపాడులో బొండాలు రకం దిగుబడులు పరిశీలిస్తున్న కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌
జిల్లాలో దాళ్వాలో రైతులు అధికంగా చేయడంతో పాటు, బొండాలు రకాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌లు వున్న నేపథ్యంలో బొండాల రకం వరి పంట సాగు, దిగుబడుల అంచనా వేయుటలో భాగంగా కలెక్టరేట్‌లో సమావేశం అనంతరం శనివారం రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌, ఐఎఎస్‌ అధికారి హెచ్‌.అరుణ్‌కుమార్‌ మండలంలోని జి.మేడపాడు గ్రామంలో పర్యటించారు. జిల్లాలో దాళ్వా వరి పంట కోతలు ప్రారంభం అవుతుండగా, మరవైపు ఎంటియు 3626 (బొండాలు) రకం సాగు చేసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 600 ఎకరాలు కోతలు కోశారని వాటిని ఎలా అమ్ముతున్నారు అన్న అంశాలపై కమిషనర్‌ రైతులను ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు. 70 శాతం మంది ఈ ప్రాంత రైతులు బొండాలు రకం సాగు చేశామని, ఎకరాకు బొండాల రకం ధాన్యం సుమారు 48 నుండి 55 వరకూ బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, బొండాల రకాన్ని పభుత్వం కొనుగోలు చేసేలా చూడాలని కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ను రైతులు కోరారు.బొండాలు రకం కొంతమేర కొనుగోలు చేయనున్నట్లు కమిషనర్‌ రైతులకు హమీ ఇచ్చారు. టిప్పర్ల ద్వారా ధాన్యం మిల్లులకు తరలిస్తే ఎలా వుంటుందని రైతులను ప్రశ్నించారు. అందుకు రైతులు సుముఖత వ్యక్తం చేయగా, ఈ విధానం వల్ల గోనే సంచులతో పని ఉండదని కమిషనర్‌ చెప్పారు. ఈ పర్యటనలో ఆయన వెంట జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలాక్కియా, ట్రైనీ కలెక్టర్‌ ప్రకార్‌ జైన్‌, సివిల్‌ సప్లై డిఎం పుష్షమణి, కాకినాడ వ్యవసాయశాఖ ఎడిఎ జివి పద్మశ్రీ, మండల తహశీల్దార్‌ లక్ష్మీ నరసకుమారి, ఎఒ ఇమ్మిడిశెట్టి సత్య, రైతులు, విఆర్‌ఒలు, ఎఇఒలు పాల్గొన్నారు.