ఏజెన్సీలో కుండపోత
పొంగిపొర్లుతున్న కొండవాగులు
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
స్తంభించిన జనజీవనం
ప్రజాశక్తి - యంత్రాంగం
జిల్లాలో గురువారం విస్తారంగా వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఏకథాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. రోడ్లపై భారీగా వర్షపునీరు చేరింది. ఏజెన్సీ మండలాల్లో భారీవర్షం కురిసింది. కొండ వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహించాయి.
జీలుగుమిల్లి :మండలంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులువంకలు పొంగిపొర్లుతున్నాయి. జీలుగుమిల్లి నుంచి బర్రింకలపాడు వెళ్లే రహదారిపై అశ్వారావుపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా వంకవారిగూడెం వెళ్లే రహదారిపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. అదే విధంగా పలుచోట్ల కొండవాగుల గుండా వరద నీరు పొంగిపొర్లుతుంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇదే భారీ వర్షమని మండల ప్రజలు చెబుతున్నారు. వరి నారు మడుల్లోకి నీరుచేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బుట్టాయగూడెం : మండలంలో భారీ వర్షం కురిసింది. కొండవాగులు ఉధృతంగా ప్రవహించాయి. కన్నాపురం దగ్గరలోని కల్వర్టు, రెడ్డిగణపవరం సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పట్టెన్నపాలెంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలేనికి, బుట్టాయగూడెం మండలం రామారావుపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో పలుచోట్ల వంతెన నిర్మాణాలు చేపట్టాలని దీర్ఘకాలంగా ప్రజలు కొరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రతిసంవత్సరం వర్షాకాలంలో ఇలాంటి తప్పడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం : మండలంలో గురువారం తెల్లవారుజామన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గూటాల, కొత్త పట్టిసీమ, పట్టిసీమ, పోలవరం పంచాయతీల్లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పోలవరం ప్రధాన సెంటర్లు, బెస్తావీధిలో డ్రెయినేజీ అస్తవస్తంగా ఉండడంతో వర్షపునీరు నిలిచి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
ఉధృతంగా జల్లేరు వాగు.. నిలిచిన రాకపోకలు
జంగారెడ్డిగూడెం : బుధవారం రాత్రి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పట్టెన్నపాలెంలోని జల్లేరువాగు ఉధతంగా ప్రవహిస్తుంది. గురువారం ఉదయానికి వాగు ఉధృతి పెరగడంతో ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఉధృతంగా ప్రవహించిన వాగు సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ వాగు దాటే మార్గం ధ్వంసం కావడంతో వాహనాలు వాగు దాటే అవకాశం లేక బుట్టాయగూడెం మీదుగా రాకపోకలు సాగించాయి. జల్లేరుపై వంతెన నిర్మాణం పూర్తయ్యి ఉంటే ఈ అవస్థలు తప్పేవని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.
ముదినేపల్లి : మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షానికి జనజీవనం స్తంభించింది. తెల్లవారుజామున మొదలైన వాన ఉదయం 10 గంటల వరకు పడుతూనే ఉంది. దీంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారాయి. వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. లోతట్టు కాలనీల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో కాలనీవాసులు అసౌకర్యానికి గురయ్యారు. రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. వర్షానికి కొనుగోలుదారులు రాకపోవడంతో చిరువ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.
చింతలపూడి : పట్టణంలో విస్తారంగా వర్షం కురిసింది. స్థానిక ఎరుకులపేటలో డ్రెయినేజీలను అక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి ఎడతెరపకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. పలుచోట్ల డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజలు అవస్థలు పడ్డారు.










