నూజివీడు రూరల్ : అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నూజివీడు మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మండలంలో పోతిరెడ్డిపల్లి, గొల్లపల్లి, తుక్కులూరు తదితర గ్రామాల్లో సుమారు వంద ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశారు. వర్షాలు కారణంగా పందిళ్లపై ఉన్న పొగాకు పూర్తిగా తడిసింది. రైతులు పాలిథిన్ పరదాలు అద్దెకు తీసుకొచ్చి కప్పినప్పటికీ ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలో 17 వందల ఎకరాల్లో సీడు మొక్కజొన్న సాగు చేయగా, ఇప్పటికే వెయ్యి ఎకరాల్లో ఒబ్బిడి పూర్తయింది. సుమారు 700 ఎకరాల్లో పంట చేలల్లో ఉంది. ఈ వర్షాలకు మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయిందని రైతులు చెబుతున్నారు. అలాగే వేలాది ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్న పంట వర్షాల కారణంగా రాలిపోతోంది. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు నిమ్మగడ్డ నరసింహ కోరారు.
బుట్టాయగూడెం:ఆకాశం మేఘావృతమై మండలంలో శనివారం పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షం జీడి మామిడికి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె రాలిపోయి పంట దిగుబడి తగ్గుతుందని కంగారుపడుతున్నారు. అలాగే మొక్కజొన్న పంట కూడా చేతికొస్తుందని, ఈ సమయంలో వర్షం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. బుట్టాయగూడెంలో శనివారం సంతకు వచ్చిన కొనుగోలుదారులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
జీలుగుమిల్లి : అల్పపీడన ద్రోణి ప్రభావంతో మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన మిరప, మొక్కజొన్న, పొగాకు, జీడిమామిడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మండలంలోని రౌతుగూడెం వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరడగంతో బుట్టాయగూడెం, జీలుగుమిల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
టి.నరసాపురం : మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. బొర్రంపాలెం, ఏపిగుంట, టి.నరసాపురం తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. మామిడి, మొక్కజొన్న, పొగాకు, నిమ్మ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తిరుమలదేవిపేటలో మూడు పెంకుటిళ్లపై చెట్లు కూలడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ముదినేపల్లి : రైతన్నను వర్షం వెంటాడుతోంది. మూడోరోజు శనివారం కూడా వర్షం పడడంతో మినుము రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. పనలపై ఉన్న పంట తడిసిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్నం మాధవ కోరారు.
చాట్రాయి : అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన మొక్క జొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. తడిసిన మొక్కజొన్న కొనుగోలు చేసే పరిస్థితి లేదనిరైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.
చెట్టు కూలి మహిళ మృతి
జంగారెడ్డిగూడెం : మండలంలోని తాడువాయిలో ఈదురు గాలులకు చెట్టు కూలి రేకులషెడ్డుపై పడిన సంఘటనలో మహిళ మృతి చెందింది. తాడువాయిలో ముత్యాలమ్మ ఆలయ సమీపంలో ఉన్న భారీ రావిచెట్టు కూలి రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో షెడ్డులో ఉన్న సంధ్య(37) అక్కడికక్కడే మృతి చెందింది. ఈమెకు భర్త శ్రీను, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఉంగుటూరు : మండలంలో పలు గ్రామాల్లో మోస్తురు వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి మబ్బులతో ఉంది. మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి మెరక ప్రాంత పొలాలకు మేలు జరిగినా ధాన్యం గింజ గడ్టిపడే దశలో వర్షం పడటంతో రైతులకు నష్టమేనని పలువురు రైతులు వాపోతున్నారు. పలు చోట్ల డ్రెయిన్లు పొంగిపొర్లాయి.
నేలకొరిగిన మొక్కజొన్న
అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న కండెలు తడిసిపోయాయి. పందిరి మీద ఉన్న పొగాకు పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 70 ఎకరాల్లో పొగాకు, 1560 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. ఈ వర్షానికి కొత్తగూడెం, అక్కుపల్లిగోకవరం గ్రామాల్లో కండెల మీదున్న మొక్కజొన్న పంట నేలకొరిగింది.
నాలుగు ఎకరాల్లో నేలకొరిగిన మొక్కజొన్న
మక్కే సూర్యచంద్రరావు
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న వేశాను. పంట చేతికి వచ్చే దశలో వర్షానికి సగంపైగా నేలకొరిగింది. అన్ని బావుంటే ఎకరానికి 45 నుంచి 50 బస్తాలు దిగుబడి రావాల్సి ఉంది. చేను పడిపోడంతో ఎంత నష్టం వస్తుందో తెలియడం లేదు.










