ప్రజాశక్తి - యంత్రాంగం
జిల్లాలో శనివారం పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అరగంటపాటు విరామం లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది.
పోలవరం: మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రం పోలవరంలో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. కల్లాల్లో ఉన్న మొక్కజొన్న తడిసి ముద్దయింది. గాలీవాన బీభత్సానికి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
నూజివీడు రూరల్ : మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. హనుమంతులగూడెం, మిట్టగూడెం, అన్నవరం, వెంకటాద్రిపురం, దిగవల్లి గ్రామాల్లో బలమైన గాలులు వీచడంతో మామిడి నేలరాలింది. అలాగే మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలకూ తీవ్రమైన నష్టం వాటిల్లినట్లు రైతులు అంటున్నారు. చేతికొచ్చిన పంటకు నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండవల్లి : మండలంలో శనివారం కుంభవర్షం కురిసింది. మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అరగంటపాటు విరామం లేకుండా కురిసిన వర్షానికి మండలంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మండవల్లిలోని బిసి, ఎస్‌సి కాలనీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారి రైల్వే గేటు వద్ద దళితవాడలోని రహదారులతోపాటు జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగింది. విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అలాగే పెదపాడు, ఏలూరు పట్టణం, రూరల్, పెదవేగి, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, కామవరపుకోట, లింగపాలెం, చింతలపూడి, ముసునూరు, చాట్రాయి తదితర మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది.










