Nov 06,2023 21:12

ప్రజాశక్తి - పెనుమంట్ర
మండలంలో సోమవారం మధ్యాహ్నం వర్షం పడింది. పలు చోట్ల భారీ వర్షం పడింది. దీంతో ఈనిక దశలో ఉన్న వరిచేలు నేలకొరిగాయి. వర్ష ప్రభావం దిగుబడిపై పడుతుందని, తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం వల్ల రోడ్లు అధ్వానంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఆచంట : వాయుగుండం ప్రభావంతో మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేని వర్షం పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండలంలో ఆచంట, కొడమంచిలి, పెనుమంచిలి, ఆచంట వేమవరం, వల్లూరు, భీమలాపురం, కరుగోరుమిల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో రైతులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. పంట పొలాలు ఈనిక దశలో, పాలు పోసుకునే దశలో ఉండడంతో వరిచేలు ఎక్కడ ఒరిగిపోతాయని భయాందోళనలకు గురవుతున్నారు.
పాలకొల్లు : పాలకొల్లులో సోమవారం మధ్యాహ్నం గంటన్నర పాటు భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు, డ్రెయిన్లు ఏకమై మురుగు రోడ్డుపై ప్రవహిస్తోంది. వర్షానికి బస్టాండ్‌ నీట మునిగి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పిపి రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది.
గణపవరం : వరి కోతలు దగ్గర పడుతున్న సమయంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో మండలంలో సోమవారం వర్షం పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 11,800 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు ప్రస్తుతం సిహెచ్‌ అగ్రహారంలో 650 ఎకరాలకు 200 ఎకరాల్లో వరి కోతలు ప్రారంభించి ధాన్యం అమ్మకాలు ప్రారంభించారు. వర్షం పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.