
ప్రజాశక్తి - మొగల్తూరు
మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వర్షం కురిసింది. గ్రామాల్లో పక్కా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు బయటకెళ్లే మార్గం లేదు. దీంతో రహదారిపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వర్షం కురవడంతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది.
పెనుమంట్ర : మండలంలో శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ఆలమూరు, భట్లమగుటూరు, ఓడూరు, నెలమూరు, వెలగలేరు, బ్రాహ్మణచెరువు, నెగ్గిపూడి, మల్లిపూడి, జుత్తిగ, సోమరాజు ఇల్లింద్రపర్రుతో పాటు పలు గ్రామాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా పొలమూరు నుంచి నౌడూరు సెంటర్ వెళ్లే రహదారి గోతులమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
పోడూరు : మండలంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మండలంలోని వద్దిపర్రు, మినిమించిలి పాడు, గుమ్మలూరు, జగన్నాధపురంలోని కాలనీ రోడ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే చాలా రోజుల నుంచి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. కవిటం నుండి పోడూరు మీదుగా గుమ్మలూరు వచ్చే రహదారి, గుమ్మలూరు నుండి పాలకొల్లు వెళ్లే ప్రధాన రహదారి గుంతల్లో నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాలకొల్లు రూరల్ : మండలంలోని పలు గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నిన్నటి వరకూ ఎండలతో ఉక్కబోస్తున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. ఈ వర్షాలు పంటలకు అనుకూలంగా ఉంటాయని రైతులు ఆనందిస్తున్నారు. ఈ వర్షం వల్ల చిరు వ్యాపారులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు.
పాలకొల్లు : పట్టణంలో వరుసగా 3వ రోజు శుక్రవారం కూడా వర్షం పడింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఉదయం నుంచి ఏదోఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పీపీ రోడ్డులో రాళ్లు లెగిసి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆచంట:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఆర్‌అండ్‌బి రహదారులకు అధ్వానంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలంలోని ప్రధాన రహదారులు, లింకు రోడ్లు, అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. మండలంలో ఆచంట, కొడమంచిలి, కోడేరు, కందరవల్లి, కరుగోరుమిల్లి, భీమలాపురం, వల్లూరు, పెనుమంచిలి, ఆచంట వేమవరం తదితర గ్రామాల్లోని రహదారులు వర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తక్షణం అధికారులు స్పందించి రహదారులపై నిలిచిపోతున్న వర్షపు నీటిని బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.