Aug 21,2023 16:44

ప్రజాశక్తి - పెనుమంట్ర
సోమవారం ఉదయం మండలంలో భారీ వర్షం పడింది. ఉదయం 8:30 నుండి 11 గంటల వరకూ పొలమూరు, పెనుమంట్ర, మాముడూరు, మార్టేరు, ఆలమూరు, భట్లమాగుటూరు, ఓడూరు, నెలమూరు, వెలగలేరు తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు కాస్త ఇబ్బంది పడ్డారు. జుత్తిగ హైస్కూల్‌ రోడ్డు, పెనుమంట్ర వెళ్లే రహదారి, మాముడూరు నుండి పొలమూరు వెళ్లే రహదారుల్లో గోతుల్లో వర్షపునీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు నానా పాట్లు పడ్డారు. అలాగే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఆచంట : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై మండలంలో సోమవారం ఉదయం ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. దీంతో ఆచంట కచేరీ సెంటర్లోని ఆచంట - మార్టేరు ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి నీట మునిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మండలంలో ప్రధాన రహదారులు, లింక్‌ రోడ్లు, ఇంటర్నల్‌ రోడ్లు అధ్వానంగా మారాయి. పలు పల్లపుప్రాంతాలు జలమయమయ్యాయి. నివాస ప్రాంతాలు, కాలనీలో సీసీ డ్రెయిన్లు నిర్మించకపోవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
తాడేపల్లిగూడెం : ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా తాడేపల్లిగూడెంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8:40 నిమిషాల నుంచి సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న డ్రెయినేజీలు ఒక్కసారిగా పొంగి పొర్లాయి. మసీదు, శేషమహల్‌ రోడ్డు, తాలూకాఫీస్‌ ప్రాంగణం, కడకట్ల, యగర్లపల్లి, ఆర్‌టిసి బస్‌ ప్రాంగణాలు నీట మునిగాయి. విద్యార్థులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.