రాయచోటి : జిల్లాలో కులగణన కార్యక్రమం పగడ్బందీగా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ కుల సంఘాల పెద్దలు, ఎన్జీవోలతో కుల గణనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి డిసెంబరు 10వ తేదీ వరకు కులగణన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబం ధించి జిల్లాలోని అన్ని కులాల ప్రజలందరూ పూర్తిగా సహకరించాలన్నారు. కులగణనపై టామ్ టామ్ వేయించడం, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కులగణన చేపట్టడం జరుగుతుందని ప్రజలందరూ వీరికి సహకరించాలన్నారు. ఇంటింటికి వెళ్లి సేకరించిన కులగణన సమాచారాన్ని ప్రత్యేక మొబైల్ యాప్‌లో పొందపరచడం జరుగుతుందన్నారు. వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి ఈ కార్యక్రమం గురించి శిక్షణ ఇచ్చి కులగణన కార్యక్రమం డిసెంబర్ 10వ తేదీ లోపల పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా పక్కాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని తప్పకుండా వేలిముద్ర వేయాల్సి ఉంటుందని ఇంటి యజమాని అందుబాటులో లేనప్పుడు ఇంటి కుటుంబ సభ్యులు వేలిముద్ర వేయవచ్చునున్నారు. వేలిముద్రలు వేయించుకునేందుకు ఆ ప్రాంతంలో నెట్వర్క్ లేకపోతే నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి వెళ్లి ఇంటి యజమానితో వేలిముద్ర తీసుకోవాలన్నారు. కులగనున్న చేపట్టడం ద్వారా జిల్లాలో ఏఏ కులాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఎవరెవరికి చేరుతున్నాయి అనే వివరాలు పక్కాగా ఉంటాయన్నారు. ప్రభుత్వం పేదలకు ఏమి చేయాలి అనే విషయాలు సులభంగా గుర్తించేందుకు కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, కెఆర్‌ఆర్‌సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖ, సోషల్ వెల్ఫేర్ డిడి జాకీర్ హుస్సేన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సందప్ప, వివిధ కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.