
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం ఎస్‌ఎస్‌ఆర్ -2024 డ్రాఫ్ట్ పబ్లికేషన్‌ను కలెక్టర్ నాగలక్ష్మి విడుదల చేశారు. అందుకు సంబంధించిన ఓటర్ల జాబితా సిడిలను నియోజకవర్గం వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్ -2024లో భాగంగా 27-10-23 నాటికి జిల్లాలో 15,17,365 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుష ఓటర్లు 7,50,056 మంది , మహిళా ఓటర్లు 7,67,207 మంది కాగా థర్డ్ జెండర్ ఓటర్లు 102 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామన్నారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ లో భాగంగా ఓటర్ల జాబితాలో ఏవైనా క్లెయిములు, అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 9వ తేదీలోపు తెలియజేయాలన్నారు. డిసెంబర్ 26 లోపల అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిశీలిస్తామన్నారు. 5.1.24న ఓటర్ల జాబితా ఫైనల్ పబ్లికేషన్ ఇస్తామని తెలిపారు. అర్హులై ఉండి ఎవరికైనా ఓటరు జాబితాలో పేరు రాకపోయినా, వారి పేరు తొలగించినా ఆన్‌లైన్ ద్వారా కూడా క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేయ వచ్చన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపుపై నవంబర్ 4,5తేదీలు , డిసెంబర్ 2,3తేదీలు, నాలుగు రోజులు స్పెషల్ కాంపెయిన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కాంపెయిన్ లో బిఎల్‌ఒలంతా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో జెసి మయూర్ అశోక్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
శత శాతం కచ్చితమైన జాబితాలు తయారు కావాలి
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అనంతరం కలెక్టర్ తహశీల్దార్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం పరిధి లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇఆర్‌ఒలు డ్రాఫ్ట్ పబ్లికేషన్లను విడుదల చేసి ప్రదర్శించాలన్నారు. అన్ని విద్యా సంస్థల్లో, కళాశాలల్లో ప్రిన్సిపల్స్ తో మాట్లాడి 18 ఏళ్ళు నిండిన వారందరిని ఓటర్లుగా చేర్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, విజయనగరం . బొబ్బిలి ఆర్‌డిఒలు సూర్య కళ, సాయి శ్రీ, ఎస్‌డిసిలు వెంకటేశ్వర రావు, నూక రాజు, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.