Sep 27,2023 23:51

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌


ప్రజాశక్తి-బాపట్ల జిల్లా
ఓటర్ల సౌలభ్యం కోసం బాపట్ల జిల్లాలో నూతన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, పలు కేంద్రాలను మార్పు చేశామని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ప్రకటించారు. సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా, పోలింగ్‌ కేంద్రాల మార్పులపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం జిల్లా కలెక్టర్‌ తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ప్రాంతాలు, పేర్ల మార్పులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ఆమోదం లభించిందని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,507 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, శిథిలావస్థలోని భవనాల నుంచి 54 కేంద్రాలను ఒకే ప్రాంతంలోని పక్కనేవున్న భవనాలకు మార్చామన్నారు. అలాగే 99 పోలింగ్‌ కేంద్రాల పేర్లను మార్పు చేశామని తెలిపారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా పౌరుల కొరకు అద్దంకి నియోజకవర్గంలో రెండు పోలింగ్‌ కేంద్రాలు, రేపల్లె నియోజకవర్గంలో ఒకటి నూతనంగా ఏర్పాటు చేశామన్నారు దీంతో జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 1,510కి చేరిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మల్లికార్జునరావు, బి ఎస్‌ పి నుంచి కోటేశ్వరరావు, బి జె పి నుంచి రామకష్ణ, సిపిఎమ్‌ గంగయ్య, కాంగ్రెస్‌ పార్టీ డి.రవి, టిడిపి ఏ.సురేష్‌ బాబు, వైసీపీ నాయకులు ఏ.మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.