ప్రజాశక్తి-పాడేరుటౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఈ ఏడాదిలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేసిందని, గతేడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ 27.5 శాతం తగ్గిందని ఎస్‌పి సతీష్ కుమార్ తెలిపారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పోలీసు సర్కిల్ కార్యాలయం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఏర్పడిన రోజు నుంచి ఇప్పటివరకు నమోదైన నేరాలు, వాటి వివరాలను ఎస్‌పి వెల్లడించారు. పాడేరు సిఐ బి.సుధాకర్, సిఐ (స్పెషల్ బ్రాంచ్) హిమగిరితో కలిసి వార్షిక నేర నివేదిక విషయాలు తెలిపారు. ముఖ్యంగా తీవ్రవాదం, గంజాయి, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పోలీస్, సెబ్ యుక్తంగా 339 గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో 56,255.5 కేజీల గంజాయి సీజ్ చేయడంతో పాటు 794 మంది ముద్దాయిలని అరెస్ట్ చేశామన్నారు. 664.1 ఎకరాలలో 31,27,500 గంజాయి మొక్కలను ద్వంసం చేశామని, 7,328 ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలకు రైతులను ప్రోత్సహించామని చెప్పారు. 2021లో 3 హత్యలు జరగ్గా, ఈ ఏడాది ఒక హత్య జరిగిందన్నారు. అలాగే ఈ ఏడాదిలో ఐదుగురు మావోయిస్ట్ లీడర్లను, 16 మంది మిలీషియా సభ్యులను అరెస్టు చేశామని, 38 మంది మావోయిస్ట్ కొరియర్స్ పై బైండోవర్ కేసులను నమోదు చేసామని తెలిపారు. 43 మంది మావోయిస్టులు, 63 మంది మిలీషియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారని, 6 చోట్ల మావోయిస్టు డంప్ లను రికవరీ చేయడం జరిగిందన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 228 మంది గ్రామీణ ప్రాంత గిరిజన యువతకు ఉపాధితో కూడిన ఉచిత శిక్షణలను ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. చింతపల్లి నుండి మారుమూల ప్రాంతం కోరుకొండకు రోడ్డు వేయించి 1లక్ష 92వేలు మందికి బస్ సౌకర్యం కల్పించామన్నారు. సారా, అక్రమ మద్యంపై 1,485 కేసులు నమోదు చేయగా, 899 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 15,186.5 లీటర్ల సారా సీజ్ చేయడంతోపాటు 3,87,962 లీటర్ల పులుపును ద్వంసం చేసామన్నారు. మానవ హత్యలు 24.3 శాతం, రోడ్డు ప్రమాదాలు 18 శాతం తగ్గిందని చెప్పారు. 6 మానవ హత్య కేసుల్లో జీవిత ఖైదు, 6 అత్యాచారం, వరకట్న కేసుల్లో కఠిన కారాగార శిక్షలు విధించడమైందని పేర్కొన్నారు. వాటర్ ఫాల్స్ వద్ద జల మరణాలు 50 శాతం తగ్గాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు లక్ష్మణరావు, రంజిత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










