ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో పసుపు క్వింటాలుకు రూ. 6850లకు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ కె.రమేష్ స్పష్టం చేశారు. గురువారం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో విఎలు, విహెచ్‌ఓలకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో డిఎం మాట్లాడుతూ, జిల్లాలో చింతపల్లి, జికె వీది, జి.మాడుగుల మండలాలలో వెలుగు ద్వారా పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలలో ఉన్న పసుపును మాత్రమే కేంద్రాలలో కొనుగోలు చేస్తారని, రైతులు తప్పనిసరిగా తమ పంటను ఎటువంటి వ్యర్ధపదార్థాలు లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలని, దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. పసుపు అమ్మిన రైతులకు బ్యాంక్ ఖాతాలకు పది రోజులలో జమ చేయబడతాయని ఆయన స్పష్టం చేశారు. రైతుభరోసా కేంద్రాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వివరించారు. ఈ శిక్షణా శిబిరంలో మార్కెఫెడ్ స్పెషల్ ఆఫీసర్ ప్రొక్యూర్మెంట్ కె.అరుణ, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు కర్ణ, శోభ, మదు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.










