ఏలూరు మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశం
ఆరు రోజులు ఆరు మండలాల మీదుగా 135 కిలోమీటర్లు సాగిన యాత్ర
25 గ్రామాల ప్రజలతో పాదయాత్ర బృందం మమేకం
తిలకం దిద్ది.. హారతులిచ్చి స్వాగతం పలికిన గ్రామస్తులు
ముంపు గ్రామాలు, పునరావాస కాలనీల్లో సమస్యలపై ఘొల్లుమన్న నిర్వాసితులు
ధైర్యం చెబుతూ అండగా ఉంటామని నేతల భరోసా
తరలొచ్చిన జాతీయ, రాష్ట్ర నాయకులు
దారి పొడవునా టిడిపి, జనసేన, కాంగ్రెస్, బిఎస్‌పి, ప్రజాసంఘాల మద్దతు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
నిర్వాసితుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సాగుతున్న పోలవరం పోరుకేక పాదయాత్ర శనివారం జిల్లాలో ముగిసింది. హనుమాన్ జంక్షన్ వద్ద కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. జూన్ 26వ తేదీ నుంచి జులై ఒకటో తేదీ వరకూ ఆరు రోజులపాటు జిల్లాలో యాత్ర సాగింది. తొలిరోజు 26వ తేదీ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం గ్రామం నుంచి గోదావరి దాటి వేలేరుపాడు మండలం రుద్రమ్మకోట వద్ద ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి కుక్కునూరు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, ఏలూరు మండలాల్లోని 25 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. పోలవరం నుంచి బుట్టాయగూడెం వరకూ ఉపయాత్ర నిర్వహించారు. మొత్తంగా 135 కిలోమీటర్ల మేర జిల్లాలో పాదయాత్ర సాగింది. మొత్తం 17 చోట్ల సభలు, ఆరుచోట్ల బహిరంగ సభల్లో నాయకులు మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర నాయకులు తరలొచ్చి యాత్రకు సంఘీభావం తెలపడమే కాకుండా, పాదయాత్రతో కలిసి అడుగులు వేశారు. తొలిరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం, వి.వెంకటేశ్వర్లు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి పాల్గొనగా, రెండోరోజు ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాస్, మాజీ ఎంఎల్‌ఎ చందా లింగయ్యదొర తమ మద్దతు ప్రకటించారు. మూడో రోజు కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్ సింగ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్, పాల్గొనగా, నాలుగో రోజు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె.ధనలక్ష్మి, ఐదోరోజు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, ఆరోరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, బిఎస్‌పి నాయకులు నేతల రమేష్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
టిడిపి, జనసేన, కాంగ్రెస్, బిఎస్‌పి, ప్రజాసంఘాల మద్దతు
పోలవరం పోరుకేక పాదయాత్రకు టిడిపి, జనసేన, కాంగ్రెస్, బిఎస్‌పి నాయకులు ప్రతి మండలంలోను ఎదురేగి పోరుయాత్ర బృందానికి మద్దతు ప్రకటించారు. టిడిపి, జనసేన మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి, స్వాగతం పలకడమే కాకుండా పాదయాత్రతో కలిసి నడిచి సభల్లో పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో టిడిపి పోలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాస్ మద్దతు పలకగా, జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు, ఏలూరులో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి చంటి మద్దతు తెలిపారు. జనసేన పోలవరం నియోజకర్గ ఇన్‌ఛార్జి చిర్రి బాలరాజు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు. సిఐటియు రాష్ట్ర, జిల్లా నాయకులు, ఆశావర్కర్స్ యూనియన్, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎల్‌ఐసి ఏజెంట్లు యూనియన్, ఐలు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్, గిరిజన సంఘాలు పెద్దఎత్తున మద్దతు పలికాయి. విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లా తదితర ప్రాంతాల నుంచి పాదయాత్ర బృందానికి మద్దతు పలికేందుకు ప్రజాసంఘాల నేతలు తరలొచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నాయకుల మండిపాటు
జిల్లాలో ఆరు రోజుల పాటు సాగిన పోరుకేక పాదయాత్రలో పాల్గొన్న నాయకులు నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం హామీ ఇచ్చిన పునరావాస ప్యాకేజీ రూ.పది లక్షలు, భూపరిహారం రూ.ఐదు లక్షలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద పరిహారం రూ.పది వేలు తక్షణం అందించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం ఇవ్వాలని, నిర్వాసిత కాలనీల్లో తాగునీరు, బడులు, ఆసుపత్రులు, శ్మశాన వాటికలు వంటి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే నిధులు విడుదల చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. పాదయాత్రకు నిర్వాసితుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర రథసారధి వి.శ్రీనివాసరావుకు వినతుల రూపంలో తమ సమస్యలను తీసుకొచ్చారు. నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల నాలుగో తేదీ విజయవాడలో జరగనున్న బహిరంగ సభ తర్వాత అన్ని పార్టీలనూ కలుపుకుని కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రతి గ్రామాన్నీ సమర క్షేత్రంగా మారుస్తామని హెచ్చరించారు.










