Nov 01,2023 22:43

జిల్లాలో కరువే లేదట...!

జిల్లాలో కరువే లేదట...!
30శాతం వర్షాభావం
3 మండలాల్లో 'క్రాప్‌ హాలిడే'
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
'జిల్లాలో కరువే లేదు' అని ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ వర్షపాతం పరిశీలిస్తే 574.5 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా ఐదు నెలల కాలంలో 399.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దాదాపు 30శాతం వర్షాభావం నెలకొంది. తిరుపతి జిల్లాలో వెంకటగిరి, పుత్తూరు, వడమాలపేట మండలాల్లో వర్షాధార పంటలు పండించేవారు. అయితే వర్షాలు సరిగ్గా లేకపోవడం, చెరువుల్లో నీరు లేక 'క్రాప్‌ హాలిడే' ప్రకటించడం గమనార్హం.
తిరుపతి జిల్లాలో 34 మండలాలు ఉన్నాయి. దాదాపు సగం మండలాలు వర్షాధారంగానే పంటలు పండించే పరిస్థితి. మెట్ట ప్రాంతమైన సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి, వెంకటగిరి, చంద్రగిరి నియోజకవర్గాల్లో వర్షాధార పంటలనే పండిస్తారు. శనగ, మొక్కజొన్న, సజ్జ, రాగి, కంది పంటలను పండిస్తారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగేది. అయితే ఈసారి 25వేల ఎకరాల్లో పంటలు వేయకుండా వదిలేశారు. వడమాలపేట, పుత్తూరు, వెంకటగిరి మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఈ మండలాల్లో అక్టోబర్‌ నెల వర్షపాతం పరిశీలిస్తే పుత్తూరులో 669.5 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా 489.4 మిల్లీమీటర్లు పడింది. -180 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా ఉంది. అలాగే వెంకటగిరిలో - 231.2 తక్కువగా ఉంది. వడమాలపేటలో -147.1 తక్కువగా వర్షం పడింది.
ఆ మూడు మండలాలను ప్రకటించాలి : పి.హేమలత, రైతుసంఘం
జిల్లాలో రైతులకు అవసరమైన వర్షం పడిందని, అంతా బాగుందని, కరువే లేదని అధికారులు నివేదికలు పంపడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటివరకూ సగం మండలాలు దుర్భిక్షంగా ఉన్నాయి. చెరువుల్లో నీళ్లు లేక, వర్భాభావం వల్ల పుత్తూరు, వడమాలపేట, వెంకటగిరి మండలాల్లో పూర్తిగా 25వేల ఎకరాల్లో 'క్రాప్‌ హాలిడే' ప్రకటించారు. ఆ మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.