
జిల్లా ఎస్‌సి, ఎస్‌టి మోనటరింగ్ కమిటీ సభ్యులు బాలకృష్ణ
ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని జిల్లా ఎస్‌సి, ఎస్‌టి, మోనటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ విమర్శించారు. భీమవరంలో ఎస్‌సి, ఎస్‌టి మోనటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ కార్యాలయంలో మాల మహానాడు అత్యవసర సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా గుమ్మాపు సూర్య వరప్రసాద్, రాష్ట్ర బహుజన సీనియర్ నాయకులు చింతపల్లి గురుప్రసాద్ హాజరై మాట్లాడారు. ఆకివీడు మండలం కాపవరంలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, అట్రాసిటీ కేసు నమోదు చేసి దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కేసులు నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందని, దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. సమస్యను డిఆర్‌సి సమావేశంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సమావేశంలో పివి.రావు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శులు గోడి పెద్దిరాజు, కుర్రపాటి వీరస్వామి, జిల్లా ఫుడ్ కమిటీ సభ్యులు సాలా అశోక్ సాలా నాని పాల్గొన్నారు.