ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో సిఆర్‌జెడ్ ప్రాంతాన్ని పక్కాగా గుర్తించి పర్యాటక అభివృద్ధికి ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నూతనంగా గుర్తించిన 67 బీచ్‌లు, కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్లాన్ చేర్చడానికి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యాటక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యాపులను రూపొందించే ముందు సిఆర్‌జెడ్ ప్రాంతాన్ని పక్కాగా గుర్తించాలని సూచించారు. సముద్ర ప్రాంతానికి కిలోమీటరు దూరంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో పర్యాటక అభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుపై విశదీకరించాలని సూచించారు. సముద్రతీర ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేని రీతిలో పర్యావరణ అనుకూల బీచ్‌లను తీర్చిదిద్దాలన్నారు. ఫిషరీస్ విశ్వవిద్యాలయం, పర్యాటక, మత్స్యశాఖలతో కూడిన 11 ప్రత్యేక బృందాలు తీరం వెంట సర్వే నిర్వహించి బీచ్‌ల అభివృద్ధికి అవకాశమున్న ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ పేరిట మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ మురళీకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అనురాధ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, పలు హోటళ్ల ఎమ్‌డిలు సువ్వారి సతీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.










