Nov 09,2023 22:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జిల్లాలో ఖరీఫ్‌ సీజన్లో 72 వేల హెక్టార్లలో వరి సాగు జరగగా, ఇప్పటి వరకు 11.3 శాతం కోతలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మాధవీలత, జెసి ఎన్‌. తేజ్‌ భరత్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాధవీలత జిల్లా ప్రగతిని వివరించారు. జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణ కోసం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు పూర్తి చేశామన్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి ధాన్యం తేమ శాతం గుర్తించేందుకు రెవెన్యూ, వ్యవసాయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రతిపాదించిన 53 ఎంపిఎఫ్‌సి కేంద్రాలకు చెంది స్థలాలు గుర్తింపు పూర్తి చేసినట్లు వివరించారు. వాటిలో 46 చోట్ల స్థలాలు అప్పగించడం జరిగిందని, మిగిలిన ఏడు పురోగతి ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. జగనన్న పాల వెల్లువ కి సంబంధించి డిసిసిబి, ఇతర బ్యాంకుల ఆధ్వర్యంలో మరిన్ని యూనిట్స్‌ గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రెండో దశ 19,253 ఇండ్ల నిర్మాణ లక్ష్యంకుగాను గత 15 రోజుల్లో ఇచ్చిన లక్ష్యంలో 1,944 ఇండ్ల నిర్మాణాలు స్టేజి కన్వర్షన్‌ సాధించడం జరిగిందని, ఇప్పటి 2570 ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయినట్లు తెలిపారు. పూర్తి చేసిన ఇండ్లకు సమాంతరంగా విద్యుత్‌, తాగునీటి వ్యవస్థ, సోప్‌ పిట్స్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని వివరించారు. కుల గణనకు సంబంధించి గ్రామీణ, అర్బన్‌ పరిధిలో సమగ్ర డేటా నమోదు కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు రమావత్‌ నాయక్‌, ఎస్‌బివి.ప్రసాద్‌, ఎస్‌.మాధవరావు, ఏ.ముఖలింగం, పి. జగదాం బ, తదితరులు పాల్గొన్నారు.