
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకిక వాదం, అసమానతలు లేని అభివృద్ధి కోరుతూ సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి రాష్ట్రవ్యాప్త బస్సు జాత నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సమ స్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చటంతోపాటు ప్రజా సమస్యలపై వినతిపత్రాలను స్వీకరిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుంది. కాకినాడ, పెద్దాపురం మీదుగా నేటి మధ్యాహ్నం జిల్లాలోని రాజానగరానికి మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాలోకి ప్రవేశించనుంది. అక్కడ సభ నిర్వహించనున్నారు. అనంతరం దివాన్ చెరువు మీదుగా లాలా చెరువుకు 3.00 గంటలకు చేరుకుంటుంది. ప్రజలు, ప్రజాసంఘాల నాయ కులు, సిపిఎం పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ఘనస్వాగతం పలకనున్నారు. అనతరం బైక్ ర్యాలీ నిర్వహించి నగరంలోని శ్యామలా సెంటర్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వద్దకు సాయంత్రం 4.00 గంటలకు చేరుకోనుంది. ఈ సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ అధ్యక్షత వహించనున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, మంతెన సీతారాం, బి.తులసీదాస్, కె. లోకనాథం ముఖ్యవక్తలుగా హాజరుకానున్నారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, కె ధనలక్ష్మి హాజరుకానున్నారు. సోమవారం రాత్రి జిల్లాలో బస చేస్తారు. అనంతరం మంగళవారం కడియం మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట, రావులపాలెం కేంద్రాల్లో పర్యటన కొనసాగనుంది.
బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి
కోటిపల్లి బస్టాండ్ వద్ద జగరబోయే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత కొన్ని రోజులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయికి వెళ్లి జిల్లాలోని అన్ని మండలాల్లో పని ప్రదేశాల్లోనూ, గ్రామాల్లోనూ వివిధ వర్గాలతో సభలు, సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వాటి కారణాలను వివరించడంతోపాటు ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకు వివరించి చెప్పారు. ఆ పార్టీ రూపొందించిన ప్రజా అజెండాను కరపత్రాల ద్వారా వివరించారు. ప్రజా రక్షణభేరి ప్రత్యేకతను వివరిస్తూ సాగబోయే నేటి బహిరంగ సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అభిమానులు పాల్గొని విజయవతం చేయాలని అరుణ్ కోరారు.