
జిల్లాకు మరో 1748 మెట్రిక్ టన్నుల యూరియా
- జిల్లా వ్యవసాయ అధికారి టి. మోహన్ రావు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాకు అదనంగా మరో 1748.385 మెట్రిక్ టన్నుల యూరియా వ్యాగన్ వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి టి. మోహన్ రావు తెలిపారు. ఆదివారం నంద్యాల రేక్ పాయింట్ వద్ద కంపెనీ వారు సమర్పించిన ముందస్తు ఎరువుల పంపిణీ ప్రణాళికలో పొందుపరచిన డీలర్లకు సరిగా వెళుతున్నాయా లేదా అని మండల వ్యవసాయ అధికారి ఇ.ప్రసాద రావుతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఎరువుల వ్యాగన్‌లో 1748.385 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు 50 శాతం యూరియా 900 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ ద్వారా రైతు భరోసా కేంద్రాలకు కేటాయించినట్లు చెప్పారు. మరో 837.90 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్లకు కేటాయించామని తెలిపారు. జిల్లాలో రబీ పంట కాలం ప్రారంభం కావడంతో రైతులు ఎరువులు ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం యూరియా 10546.29 మెట్రిక్ టన్నులు, డిఎపి 7906 మెట్రిక్ టన్నులు, ఎంఒపి 4716 మెట్రిక్ టన్నులు, ఎన్‌పికె కాంప్లెక్స్‌లు 21720 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పి 1072 మెట్రిక్ టన్నులు ఎరువులు ప్రైవేట్ డీలర్లు దగ్గర, రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో పంటలకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఒకవేళ ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారికి, లేదా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదుపై వ్యవసాయ శాఖ వారు తనిఖీలు చేసి అధిక ధరలకు విక్రయించిన దుకాణ యాజమానులపై ఎఫ్‌సిఒ 1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌సిఎల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్, కంపెనీ హ్యాండ్లింగ్ ఆపరేటర్ తదితరులు పాల్గొన్నారు.