Jul 23,2023 21:52

పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ లాఠకర్‌

*రెండు రోజుల్లో రానున్న 7 వేల వివి ప్యాడ్స్‌
*జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ :
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఇవిఎంలు) చేరుకున్నాయి. కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన భవనంలో ఇవిఎంలను భద్రపరిచారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ లాఠకర్‌ సంబంధిత అధికారులతో కలిసి ఆదివారం భవనాన్ని పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇవిఎంల గొడౌన్‌ను ఖరారు చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు విశాఖపట్నం కలెక్టరేట్‌ నుంచి 1,440 బ్యాలెట్‌ యూనిట్లు (బియు), 2,100 కంట్రోల్‌ యూనిట్లు (సియు) వచ్చాయి. మరో రెండు రోజుల్లో ఏడు వేల వివి ప్యాడ్స్‌ రానున్నాయి. ఇవిఎంలను పరిశీలించేందుకు ప్రతినిధులను పంపించాలని, వారి సమక్షంలోనే గొడౌన్‌ తెరవనున్నట్లు జిల్లా యంత్రాంగం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, జిల్లా రెవెన్యూ అధికారి మురళీకృష్ణ ఇవిఎంల స్వీకరణ ప్రక్రియను ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,342 పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌ఒలను నియమించామన్నారు. బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు చేర్పులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా బూత్‌ లెవల్‌ ఏజెంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, బిజెపి నాయకులు ఇప్పిలి సీతారాజు, బిఎస్‌పి నాయకులు బొకర నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.