Jun 25,2023 23:53

భద్రపరుస్తున్న వివి ఫ్యాడ్స్‌

ప్రజాశక్తి-పాడేరు:సుమారు 3100 ఎన్నికల వివి ప్యాడ్స్‌ ఆదివారం అల్లూరి జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక ఉప కలెక్టర్‌ వివిఎస్‌ శర్మ, పాడేరు మండల తహసిల్దార్‌ త్రినాధరావు నాయుడు మూడు రోజుల క్రితం బెంగళూరులో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీ నుండి 3100 వి.వి ప్యాడ్లను మూడు కంటైనర్లలో అత్యంత భద్రత మధ్య జిల్లా ప్రధాన కేంద్రం పాడేరుకు తీసుకు వచ్చారు. ఉదయం పాడేరు చేరుకున్న వివి ఫ్యాడ్లను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈవీఎం వేర్‌ హౌస్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ జె శివ శ్రీనివాసు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పర్యవేక్షణలో కట్టు దిట్టమైన భద్రతతో జాగ్రత్త పరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, సీసీ కెమెరాలు 24 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్‌ వివిఎస్‌ శర్మ, బిజెపి, బీఎస్పీ, ఐఎన్‌సి, సిపిఐ, సిపిఎం, వైఎస్‌ఆర్సిపి, టిడిపి పార్టీల ప్రతినిధులు కె.రాఘవేంద్రరావు, ఎం పండన్న, వి.కృష్ణారావు, జె.రాజబాబు, వి.దాసు, ఎస్‌ మంగన్న దొర, బి.జ్యోతి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.