ప్రజాశక్తి - ఉంగుటూరు
చేబ్రోలు విశాల సహకార సంఘం (నారాయణపురం సొసైటీ) రైతులకు రుణాలు ఇవ్వడంలో జిల్లాకు ఆదర్శంగా ఉన్నామని త్రిసభ్య కమిటీ ఛైర్‌పర్సన్ యెలిశెట్టి పాపారావు బాబ్జి తెలిపారు. సొసైటీ సర్వసభ్య సమావేశం బాబ్జి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గతంలో ధాన్యం కొనుగోలులో అనేక ఇబ్బందులు ఎదర్కునే వారమని ఈ సొసైటీ ద్వారా ఎలాంటి సమస్యలూ రాకుండా రైతులకు ధాన్యం హమాలీ ఛార్జీలతో సహా డబ్బులు రైతుల ఖాతాలోకి జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. బాబ్జి మాట్లాడుతూ ఈ సొసైటీలో తాను ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ నాలుగేళ్ల కాలంలో కౌలు రైతులు, దీర్ఘ, స్వప్ప కాలిక రుణాలు, గోల్డ్‌లోన్స్ తదితర రుణాలను గణనీయంగా పెంచి రూ.36 కోట్లకుపైగా రుణాలు అందించామన్నారు. నికర లాభాన్ని రూ.1.78 కోట్లతో అభివృద్ధిలో జిల్లాలో మొదటి స్థానంలో నారాయణపురం సొసైటీని నిలపడంలో ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు సహకారంతోనే ఇదంతా సాధ్యం చేయగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ సభ్యులు దాసరి సత్యనారాయణ, సూరే ఏడు కొండలు, ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, జడ్‌పిటిసి సభ్యురాలు కొరిపల్లి జయలక్ష్మి, సొసైటీ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










