Oct 22,2023 21:14

జిల్లాకు 30 కొత్త బస్సులు

ప్రజాశక్తి-విజయనగరం కోట : 'వచ్చే ఏడాది జనవరిలో జిల్లాకు 30 కొత్త బస్సులు రానున్నాయి. ప్రభుత్వంలో ఎపిఎస్‌ఆర్‌టిసి విలీనం కావడంతో ఆర్‌టిసి అధికారులకు ఆర్థిక వెసులుబాటు లభించింది. దీంతో డిపోల నిర్వహణ కొంతమేర సులభతరం అవుతోంద'ని విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ వారం తనను కలిసిన 'ప్రజాశక్తి'కి ఆయన ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు...
జిల్లా పరిధిలో ఎన్ని బస్సులు ఉన్నాయి.?
విజయనగరం జిల్లా పరిధిలో విజయనగరం, శృంగవరపుకోట డిపోల్లో 171 బస్సులు ఉన్నాయి. అందులో 115 ప్రభుత్వ బస్సులు, 56 అద్దె బస్సులు ఉన్నాయి. సూపర్‌ లగ్జరీ బస్సులు 5, డీలక్స్‌ బస్సులు 24, ఎక్స్‌ప్రెస్‌లు 14, మెట్రో 14, పల్లె వెలుగు బస్సులు 106 ఉన్నాయి. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ద్వారా 10 బస్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు 63 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. దీనివల్ల రెండు డిపోలకు రోజుకు రూ.27 లక్షలు ఆదాయం వస్తోంది.
ఆర్‌టిసి లాభనష్టాలు సంగతేమిటి.?
విజయనగరం జిల్లాలో 2021- 22కు సంబంధించి ఆర్‌టిసికి రూ.51 కోట్లు నష్టం వాటిల్లింది. 2022-23 గాను సంస్థకు రూ.30 కోట్లు నష్టం వచ్చింది. మునుపటి ఏడాది కంటే 20 కోట్లు నష్టం తగ్గింది.
జిల్లాలో ఎక్కువగా కాలం చెల్లిన బస్సులు తిప్పడం వల్ల తరచూ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై మీరేమంటారు.?
ప్రస్తుతానికి జిల్లాలో కాలం చెల్లిన బస్సులంటూ ఏమీ లేవు. 24వ తేదీతో శృంగవరపుకోట డిపోకు చెందిన బస్సు కాలం పూర్తయింది. దాన్ని ఆ రోజుతోనే నిలిపేస్తున్నాం. గతంలో ఒక బస్సు కాలపరిమితి 13 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఆపేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 15 ఏళ్ల కాల పరిమితిగా పెట్టారు. 2022లో 16 బస్సులు కాలం చెల్లినవి ఉంటే వాటిని నిలుపుదల చేశాం. 25 బస్సులు మరమ్మతులకు గురయ్యాయి. వీటికి కిటికీలు, గ్లాసులు, రూప్‌ వర్క్‌, టైర్లు తదితర స్పేర్‌ పార్ట్స్‌ అన్ని వేసి, ఒక్కొక్క బస్సుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి మరమ్మతులు చేశాం. 2020లో ప్రభుత్వంలో విలీనమైన తరువాత స్పేర్‌ పార్ట్స్‌ ఏవీ రావడం లేదు. వస్తున్న ఆదాయం నుంచే తీసుకొని మరమ్మతులు చేస్తున్నాం. ఇటీవల కాలంలో రూ.6 కోట్లతో స్పేర్‌ పార్ట్స్‌, టైర్లు, గ్లాసులు, ఇతర వస్తువులు కొనుగోలు చేశాం.
కమర్షియల్‌ షాపుల ఆదాయం ఎలా ఉంది.?
జిల్లాలో రెండు డిపోల్లో 228 షాపులు అద్దెకు ఇచ్చాం. వీటి ద్వారా నెలకు ఆర్‌టిసికి 25 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది.
డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలేమిటి.?
ఉద్యోగుల భద్రత దృష్ట్యా చర్యలు చేపడుతున్నాం. ప్రతినెలా మూడో శుక్రవారం గ్రీవెన్స్‌ ఏర్పాటు చేసి, వారి సమస్యలను తెలుసుకుంటున్నాం. గత నెలలో 59 సమస్యలు వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ప్రభుత్వంలో విలీనం తరువాత పరిస్థితి ఏమిటి.?
ప్రభుత్వం 2020 జనవరిలో ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో జిల్లాలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. జీతాల భారం ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం క్రూడ్‌ ఆయిల్‌ పెరుగుదల వల్ల అనుకున్న స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదు. లిఫ్టు 1/19 జిఒ ప్రకారం డిపోలలో ముందుకెళ్తున్నాం. ఉద్యోగులపై ఎటువంటి ఒత్తిడి తేకుండా, వారి సహకారంతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం.