Mar 27,2023 20:35

జెండా ఊపి 104 వాహనాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులు

జిల్లాకు '104' వాహనాలు 5 మంజూరు
జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

        ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అదనంగా 104 వాహనాలు కొత్తగా 5 మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వైయస్‌ఆర్‌ సెంటినరీ హాలు ఆవరణలో కొత్త 104 వాహనాలను జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ వెంకటరమణ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 29 మండలాలకు 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటికి అదనంగా మరో 5 కొత్త వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మంజూరైన ఐదు వాహనాలను డోన్‌, ప్యాపిలి, బేతంచెర్ల, నంద్యాలకు, ఒకటి రిజర్వులో వుంటుందన్నారు. పెద్ద మండలాల్లో వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడటం వల్ల ప్రభుత్వం అదనంగా మరో 5 కొత్త వాహనాలు మంజూరు చేసిందన్నారు. ప్రతి 104 వాహనం ఒక సచివాలయాన్ని రెండుసార్లు సందర్శించి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఇందులో డాక్టర్‌, ఎంఎల్‌హెచ్‌పి, ఏఎన్‌ఎం, ఆశా, ఎంపిహెచ్‌ఏ, డిఇఒ అందుబాటులో ఉంటారన్నారు. ఒక మెడికల్‌ ఆఫీసర్‌ 104 విధులను నిర్వహిస్తే మరో మెడికల్‌ ఆఫీసర్‌ పిహెచ్‌సిలో సేవలు అందిస్తారన్నారు. ఉదయం వేళల్లో వచ్చిన ఏఎన్‌సి, పిఎన్‌సి, బీపీ, షుగర్‌, జనరల్‌ ఓపి చూస్తారని, మధ్యాహ్నం నుండి రాలేని వికలాంగులు, వృద్ధులు, మంచానికి పరిమితమైన వారిని పరీక్షించి మందులు ఇస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రభావతి, 104 జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జగదీష్‌ చంద్రారెడ్డి, 104 జిల్లా మేనేజర్‌ మొహమ్మద్‌ రఫీ, ఇఎంఎల్‌హెచ్‌పిలు పాల్గొన్నారు.