Nov 24,2022 23:41

మాట్లాడుతున్న పిఒ గోపాలకృష్ణ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: సేవా భావంతో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌, ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. గురువారం ఐటిడిఎ సమావేశ మందిరంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ అల్లూరి జిల్లా విభాగం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చేనెలలో రాష్ట్ర గవర్నర్‌ జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని అన్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో జరిగే మెగా వైద్యశిబిరంలో పాల్గొనే అవకాశం ఉందని, దానికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. డిసెంబరు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి పది వేల మందిని రెడ్‌ క్రాస్‌ జీవిత సభ్యులుగా చేర్చాలన్నారు. రంప చోడవరం, చింతూరు డివిజన్లకు రెడ్‌ క్రాస్‌ సేవలను విస్తరించాలని చెప్పారు. సంస్థ సేవలు గిరిజనులకు పూర్తి స్థాయిలో అందించి ఆరోగ్య వెలుగులు నింపాలన్నారు. రక్తం కొరత లేకుండా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు షెడ్యూలు ప్రకారం రక్త దాన శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రతీ నెలా రెడ్‌ క్రాస్‌ కమిటీ సమావేశం నిర్వహించి సంస్థ నిర్వహణలో జరిగిన ఖర్చులకు ఫైనాన్స్‌ కమిటీ ఆమోదం పొందాలన్నారు. సంస్థకు వచ్చిన నిధులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేసారు. ఐటిడిఎ నుండి రెడ్‌ క్రాస్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అవసరమైన స్టేషనరీని అందిస్తామన్నారు. సేకరించిన రక్తం నిల్వలు, పంపిణీ చేసిన రక్తం వివరాలను సక్రమంగా రికార్డులలో నమోదు చేయాలన్నారు. సబ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముందుగా రెడ్‌ క్రాస్‌ ట్రెజరర్‌ టి.అప్పారావు సంస్థ ఆదాయ, వ్యయాలను సభకు వివరించారు. అనంతరం రెడ్‌ క్రాస్‌ సంస్థ జీవితకాల సభ్యులు ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ ఎస్‌.గంగరాజు, సెక్రటరీ ఈశ్వరరావు, లైఫ్‌ మెంబర్లు లీలాప్రసాద్‌, లోహితాస్‌, పి.సూర్యారావు జి.సుభ్రమణ్యం, గౌరీశంకర్‌, జయమ్మ, కన్యాకుమారి, స్వాతి సమన్వయ కర్త కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.