జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల రిలే దీక్షలు
ప్రజాశక్తి - యంత్రాంగం
ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు, సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రిలే నిరాహార దీక్షలను సోమవారం నిర్వహించారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన దీక్షలను పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణవేణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి ఐవి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలపై పలుమార్లు శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతానని, సమస్యలు పరిష్కరిస్తానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారన్నారు. ఈ హామీలు అమలు చేయాలని కోరుతుంటే పోలీసులతోఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతున్నారన్నారు. హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఫేస్ యాప్ కారణంగా గర్భిణులు, అంగన్‌వాడీలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం ఈ యాప్‌ను రద్దు చేయాలన్నారు. మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లను గుర్తించాలన్నారు. నాణ్యమైన సెల్ ఫోన్ ఇవ్వాలని అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కె.విజయ, కె.కృష్ణవేణి, పి.అమూల్య, మణి మాల, రుక్మిణి, దైవకృప తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్‌లో అంగన్‌వాడీలు చేపట్టిన దీక్షకు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు హాజరై మద్దతు తెలిపారు. కపిలేశ్వరపురం ఐసిడిఎస్ కార్యాలయం ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బేబి, సిహెచ్.రాణి, డి.ఆదిలక్ష్మి, పి.కుమారి ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. సిడిపిఒ గజలక్ష్మికి వినతిపత్రం అందించారు. రామచంద్రపురంలో నిర్వహించిన దీక్షలను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ మాట్లాడారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, ప్రమోషన్లలో రాజకీయం జోక్యాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. రాజోలు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల అంగన్‌వాడీలు రిలే దీక్ష చేపట్టారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కెజి.రత్న కుమారి, కె.సుజాత మాట్లాడారు. సిఐటియు నాయకులు సిహెచ్.సూర్యప్రకాష్, పీతల రామచంద్రరావు, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, మంగెన హైమావతి, టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. ముమ్మిడివరం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద దీక్షలను వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి, సీనియర్ నాయకులు సకిలే సూర్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గాప్రసాద్ ప్రారంభించారు. పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐవి, యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.కృష్ణవేణి శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. డిసెంబర్ ఒకటో తారీకులోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరిచంఆరు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు వి.మోహన్‌రావు సంఘీభావం తెలిపారు.