ప్రజాశక్తి - భీమడోలు
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని భీమడోలు వ్యవసాయ అధికారి సూరిశెట్టి పద్మజ వీర ఉషారాణి జిల్లాస్థాయిలో ఉత్తమ వ్యవసాయ శాఖ అధికారిగా ఎంపికయ్యారు. భీమడోలు మండల పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేలైన యాజమాన్య పద్ధతుల్లో పొలంబడి కార్యక్రమం నిర్వహణ, ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు భీమడోలు మండలంలో ముంపునకు గురైన వ్యవసాయ క్షేత్రాల్లో నిల్వ ఉన్న నీటిని తరలించేందుకు సమస్యను తొలుత స్థానిక వ్యవసాయ సహాయ సంచాలకులు, అనంతరం సంయుక్త సంచాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. ముంపు బెడదను తప్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పైరు సంరక్షణ చర్యలు చేపట్టినందుకు, ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు రైతులకు సకాలంలో అందించేందుకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు రైతు భరోసా కేంద్రం ద్వారా చేపట్టే వివిధ కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగేందుకు సహకరించినందుకు జిల్లాస్థాయిలో ఉత్తమ వ్యవసాయ అధికారిగా ఎన్నికయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. భీమడోలు వ్యవసాయ అధికారిగా రెండేళ్ల క్రితం బాధ్యతలను చేపట్టిన ఉషారాణి 2012లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, ఉప్పలగుప్పం, మామిడికుదురులలో పనిచేసి బదిలీపై భీమడోలు వచ్చారు. ఈ మేరకు భీమడోలులోని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సహాయ సంచాలకులు పి.ఉషారాజకుమారితో పాటు మండల పరిధిలోని గ్రామ సచివాలయాలకు చెందిన వ్యవసాయ సహాయకులు, కార్యాలయ సిబ్బంది సన్మానించారు.










