Nov 01,2022 23:38

ఎంపికైన గొలుగొండ మండల జోగుంపేట క్రీడాకారులు

ప్రజాశక్తి- నక్కపల్లి :స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పిడి కుందూరు రాజు తెలిపారు. మంగళవారం హెచ్‌ఎం రాణి లలిత ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు సమానంగా క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాశాలతో పాటు, ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. గెలుపొందిన విద్యార్థులంతా జిల్లా స్థాయి క్రీడాలలో రాణించి, రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.అనంతరం జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను పిడి రాజు వెల్లడించారు. నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఎంపికలో నక్కపల్లి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్ని విభాగాలలో అత్యున్నత ప్రతిభని కనబరచి 19 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు రాజు తెలిపారు. కబడ్డీ అండర్‌ :14,17, విభాగాలలో ఎం. భాస్కర్‌, పి.ప్రసాద్‌, ఎం.నాని, ఎం. కుమారస్వామి, జగదీశ్‌లు, వాలీబాల్‌ అండర్‌ :14,17, విభాగాలలో యు. అరవింద్‌, పి.ప్రసాద్‌, ఎం.నాని, సి.హెచ్‌. గౌతమ్‌ కృష్ణ, బాల్‌ బాడ్మింటన్‌ అండర్‌ :17 లో కె.లక్ష్మణ్‌, దుర్గా నరేష్‌, 100మీటర్లు, 400మీటర్లు, 800 మీటర్లు పరుగులో పలువురు ఎంపిక అయ్యారని తెలిపారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కుందూరు రాజును హెచ్‌ఎం రాణి లలిత, తల్లిదండ్రులు కమిటీ చైర్మన్‌ కర్రి పద్మ, వైస్‌ చైర్మన్‌ లోవ కన్నబాబు, కమిటీ సభ్యులు ఏసుబాబు ,గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అప్పారావు, బాబూజీ, సత్యవతి, ఎన్‌వి ఎస్‌ ఆచార్యులు, రమణ, కోచ్‌ దీక్షిత్‌ పాల్గొన్నారు.
కశింకోట : అనకాపల్లిలో జరిగిన నియోజకవర్గం స్కూల్‌ గేమ్స్‌ పోటీలలో కశింకోట బాలురు హైస్కూల్‌ విద్యార్థులు 27 మంది మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీధరరెడ్డి, పిఇటి ప్రభాకరరావు, సహోపాధ్యాయులు ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.
గొలుగొండ: జోగుంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్ధులు జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు వి.సరోజిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ, యోగాలో అండర్‌-17, అండర్‌-14లో సత్తా చాటారన్నారు. ఈ సందర్భంగా వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పిడి బి.లోవరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.