Feb 24,2023 23:45

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ అప్పారావు

ప్రజాశక్తి- సబ్బవరం
మండలంలోని తవ్వవానిపాలెం గ్రామంలో గ్రామ దేవత శ్రీపరదేశిమాంబ అమ్మవారి పండగ సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తుంపాల అప్పారావు శుక్రవారం ప్రారంభించారు. వైసిపి నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత బోకం శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో గ్రామ సర్పంచ్‌ బోకం స్వామినాయుడు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ తవ్వవానిపాలెం గ్రామాన్ని బోకం శ్రీనివాసరావు సొంత నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కబడ్డీ పోటీలు శుక్రవారం, శనివారం రెండు రోజులు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు, నాలుగో బహుమతి రూ.8 వేలు చొప్పున అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకుడు, పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాసరావు, సర్పంచ్‌ బోకం స్వామినాయుడు, మాజీ సర్పంచ్‌ బోకం అప్పలనాయుడు, మండల వ్యవసాయ సలహా కమిటీ డైరెక్టర్‌ బోకం కాసుబాబు, మండల వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు యడ్ల నాయుడు, సచివాలయం కన్వీనర్‌ బోకం నాగేశ్వరరావు, ఉపసర్పంచ్‌ వనం దేముడుబాబు, వార్డ్‌ మెంబర్లు, శ్రీనివాస్‌ యూత్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.