ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం శాంతి పావురాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై గహ నిర్మాణశాఖ, జిల్లాలో పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారులు, ప్లోటింగ్ జెట్టీ తదితర ప్రాజెక్టులకు చేసిన భూ సేకరణపై విజయనగరం ఆర్‌డిఒ విభాగం శకటాలను ఏర్పాటు చేశాయి. కొత్తగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇంటింటికీ పోషకాహార సరుకులను తీసుకెళ్లే విధానం, తల్లీబిడ్డా ఆరోగ్యం కోసం తీసుకోవల్సిన చర్యలపై మహిళా శిశు సంక్షేమశాఖ, వన్యప్రాణుల ఆవాసాలను సంరక్షిద్దాం-జన సమూహాల్లోకి రాకుండా నివారిద్దాం నినాదంతో అటవీశాఖ, వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్న వైఎస్‌ఆర్ ఉచిత విద్యుత్ పథకం, టోల్ ఫ్రీ నెంబరు 1912పై విద్యుత్ శాఖ, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాన్ని భారీ ఎత్తు చేపట్టిన పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, అత్యవసర సమయంలో వినియోగించే 207 వజ్ర వాహనం, దిశ జాగతి యాత్రా వాహనాలతో జిల్లా పోలీసు శాఖలు శకటాల ప్రదర్శన నిర్వహించాయి. పెరేడ్ గ్రౌండ్‌లో ప్రదర్శన అనంతరం నగరంలోని మయూరి జంక్షన్, ఆర్‌టిసి కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ వరకు ఈ శకటాల ప్రదర్శనను నిర్వహించి పౌరులను ఆకట్టుకున్నాయి. శకట ప్రదర్శనను ప్రత్యేక ఉప కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ చేసిన మాక్ డ్రిల్, అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించింది.
ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు మంత్రి ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ఉపకరణాలను పంపిణీ చేశారు. ఎపి మైక్రో ఇరిగేషన్ ఆధ్వర్యంలో 18 మంది రైతులకు సుమారు రూ.6.5లక్షలు విలువ చేసే బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.2.16లక్షలు విలువ చేసే లాప్‌టాప్‌లు, స్క్రెచెస్ జతలు, హియరింగ్ మిషన్లు, వీల్ ఛైర్‌ను పంపిణీ చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్‌సి రైతులకు ప్రకతి సేద్యం చేసేందుకు ఒక్కొక్కరికి సుమారు రూ.10వేలు విలువైన 5 విత్తన కిట్లు పంపిణీ చేశారు. బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాపునేస్తం పథకం కింద కాపు మహిళలకు ఒక్కొక్కరికీ రూ.15వేలు చొప్పున 5,934 మందికి ఆర్థిక ప్రోత్సాహకాన్ని, పరిశ్రమల శాఖ ద్వారా జగనన్న బడుగు వికాశం క్రింద ఆరుగురు లబ్దిదారులకు రూ.66.4 లక్షలు విలువైన స్వయం ఉపాధి యూనిట్లను అందజేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా షాదీ తోఫా క్రింద ఒక మస్లిం జంటకు లక్ష రూపాయల ప్రోత్సాహ కాన్ని అందించారు.
ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలు
ఇటీవల కామన్‌వెల్త్ క్రీడల్లో బహుమతులు సాధించిన జిల్లా క్రీడాకారులు ఎస్.పల్లవి, బి.హారిక, సిహెచ్ శ్రీలక్ష్మి, ఎస్.గురునాయుడులను పతకాలతో అభినందించారు. పోలీసు శాఖలో విశిష్టమైన సేవలను అందించి, సేవా పురస్కారం, పతకాలను సాధించిన అధికారులకు పతకాలను అందించి అభినందించారు. డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్‌సిలు పాకలపాటి రఘువర్మ, డాక్టర్ సురేష్‌బాబు, గజపతినగరం ఎంఎల్‌ఏ బొత్స అప్పలనరసయ్య, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, డిసిసిబి ఛైర్మన్ వేచలపు వెంకట చినరామి నాయుడు, డిసిఎంఎస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ అవనాపు భావన, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ లయా యాదవ్, పలువురు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి
జిల్లా కేంద్రంలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన 77వ స్వాతంత్య్ర వేడుకలు అత్యంత సాదాసీదాగా జరిగాయి. వివిధ శాఖల ఆధ్వర్యాన శకటాల ప్రదర్శన మినహా వాటిలో స్వతంత్య్ర సంగ్రామంలో జిల్లా పాత్రను, సమరయోథులను గుర్తుచేయలేక పోయారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జారీచేసిన ప్రశంసా పత్రాల జారీలో కలెక్టర్ ఆదేశాలు అమలు కాలేదు. దీంతో, కొంతమంది జిల్లా అధికారులు, పలు శాఖల సిబ్బంది తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది వేడుకలకు హాజరయ్యే జనాభా కూడా తగ్గింది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవానికి 15రోజుల ముందు నుంచే ప్రభుత్వ శాఖలు, శాఖాధి పతుల్లో, పాఠశాలల్లో హడావుడి కనిపించేది. ముఖ్యంగా పాఠశాలల్లో రెండు వారాల ముందు నుంచే స్వాతంత్య్ర పోరాటం, అశువులు బాసిన మహనీయులను గుర్తు చేస్తూ వ్యాసరచన, కవితలు, చిత్రలేఖనం, పోరాట యోధుల వేషధారణ, నాటికలు, దేశభక్తిగేయాల పోటీలు నిర్వహించేవారు. వీటితోపాటే వివిధ రకాల ఆటల పోటీలు కూడా నిర్వహించేవారు. ఇలాంటి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి, జిల్లా కేంద్రంలో నిర్వహించే స్వాతంత్య్రవేడుకల్లో ప్రదర్శనలిచ్చేందుకు అవకాశం కల్పించేవారు. వీరి మధ్య కూడా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి, అందులో దేశభక్తి, స్వాతంత్య్రోమ స్ఫూర్తిని నింపే నాటికలు, ఆటపాటలను ఎంపిక చేసేవారు. ఇందుకు కలెక్టర్ ఆధ్వర్యాన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది అటువంటి కసరత్తు ఏమీ జరగలేదని సాక్షాత్తు అధికారులే చెబుతున్నారు. దీంతో, వేడుకల్లో నాలుగైదు ఆటపాటలతో ముగిశాయి. అవి కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో వేడుకలు చప్పగా సాగాపోయాయంటూ కొందరు, మొక్కుబడిగా నిర్వహించారని మరికొందరు చర్చించుకున్నారు.
ఇక కలెక్టర్ పేరున జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జారీచేసే ప్రశంసా పత్రాల పంపిణీలోను పారదర్శకత లోపించిందనే విమర్శలు వినిపించాయి. అంతకంటే ముఖ్యంగా కలెక్టర్ తొలుత జారీచేసిన ఆదేశాలకు భిన్నంగా ఎక్కువ మందికి అందజేయడంతో ఎవరికి నచ్చినంతమందిని వారు సిఫార్సు చేసుకున్నారని, కలెక్టర్ తరపున పనిచేసేవారు కూడా సంఖ్యను పట్టించుకోలేదని మరికొందరి ప్రభుత్వ ఉద్యోగుల నోట వినిపించింది. ముఖ్యంగా గతంలో ప్రశంసలు అందుకున్నవారికి ఈసారి అవకాశం సిఫార్సులు చేయవద్దని, ప్రతి శాఖలోనూ ముగ్గురు కన్నా ఎక్కువ మందికి సిఫార్సులు చేయవద్దని సూచన చేశారు. కానీ ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అందుకున్న జిల్లా అధికారులకు కూడా అందజేయడం గమనార్హం. ఇక సిబ్బంది విషయానికి వస్తే...సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయానికి చెందిన 13మందికి ప్రశంసలు అందజేశారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ తదితర శాఖలు కలెక్టర్ ఆదేశాలకు రెట్టింపు, నాలుగొంతుల స్థాయిలో సిఫార్సులు చేసి, ప్రశంసలు అందేవిధంగా చూసుకున్నారని మరికొన్ని శాఖలకు చెందిన సిబ్బంది చెవులు కొరుక్కున్నారు.
మంత్రి ప్రసంగం కూడా ప్రభుత్వంపై ప్రశంసల జల్లు, పథకాల ప్రగతి మినహా స్వాతంత్య్ర సంగ్రామంలో జిల్లా పాత్రనేమీ గుర్తు చేయలేదు. మొత్తం ప్రసంగంలో జిల్లాలో చేపట్టిన అభివద్ది, సంక్షేమ పథకాలను వివరించడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. వాస్తవానికి స్వాతంత్రోద్యమంలో విజయనగరం మహారాజ కళాశాల కేంద్రంగా క్వింట్ ఇండియా, సైమన్ గోబ్, ఉప్పు సత్యాగ్రహం వంటి దీక్షలు సాగాయి, మాకొద్దీ తెల్లదొర తనం అంటూ గరిమెళ్ల తన పాటలతో ఉర్రూతలూగించారు. జిల్లా నుంచి పాల్గొన్న సమరయోధుల్లో సాలూరుకు చెందిన కూనిశెట్టి వెంకటనారాయణ దొర అగ్రగణ్యులు. సంపన్న కుటుంబంలో పుట్టిన దొర విలాసవంతమైన జీవితాన్ని విడిచి చిన్న వయసులోనే స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. గురజాడ, శ్రీశ్రీ వంటి ఉత్తరాంధ్రకు చెందిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పత్రికా సంపాదకులు ఎంతోమంది భాగస్వామ్యమయ్యారు. స్వాతంత్య్ర వేడుకల్లో అమాత్యులుగానీ, అధికారులుగానీ ఇవేవీ గుర్తుచేయలేక పోయారు. కనీసం ఆ కుటుంబాలకు చెందిన వారినైనా వేడుకలకు ఆహ్వానించి ఉంటే బాగుండేది. చివరకు వేడుకల్లో వ్యాఖ్యానం కూడా పేవలవంగావుండడంతో సభికులు నివ్వెరబోయారు.










