Aug 15,2023 22:17

పోలీసుల గౌరవవందం స్వీకరిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం

          పుట్టపర్తి రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించి, శ్రీ సత్యసాయి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు. పుట్టపర్తి శివారు ప్రాంతంలోని (శిరసాని హిల్స్‌) పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డిలతో కలిసి మంత్రి జాతీయ పతాకావిష్కరణ చేసి, జాతీయ గీతాలాపన చేశారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టి, అమలు చేస్తున్న అభివద్ధి కార్యక్రమాలపై ప్రజలకు మంత్రి తన సందేశం ద్వారా తెలియజేశారు.
ఎందరో మహానుభావుల త్యాగం వల్ల దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి కల్లూరు సుబ్బారావు, మెళవాయి గోవింద రెడ్డి, పేరూసాహెబ్‌, కెవి.రామకష్ణా రెడ్డి, ఎగువ వీధి చితంబర రెడ్డి వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. ఆ మహనీయుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. అదే స్ఫూర్తితో దేశ, రాష్ట్ర ప్రగతి కోసం మనవంతు కషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పతంలో ముందుకు వెళ్తోందని చెప్పారు. సుపరిపాలనే లక్ష్యంగా, స్వచ్ఛమైన అవినీతి రహిత, వివక్షత లేని, పారదర్శక పాలన అందించే దిశగా ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు అయిన శ్రీ సత్యసాయి జిల్లా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు ముఖ్యమంత్రి ఈప్రాంతంలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజాసంక్షేమ పాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివద్ధి పథంలో సత్యసాయి జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడానికి కషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, పుట్టపర్తి ఎంపీపీ రమణారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ తుంగ ఓబుళపతి, పుడా ఛైర్మన్‌ లక్ష్మీ నరసమ్మ, అగ్రి బోర్డ్‌ ఛైర్మన్‌ ఎవి.రమణారెడ్డి, ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, ఎఎస్‌పి విష్ణుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాలు... సాంస్కృతిక కార్యక్రమాలు
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అభివద్ధి ప్రగతిపై ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శనను తలకించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకునే విధంగా సాంస్కతి కార్యక్రమాలను నిర్వహించారు. పోలీస్‌ డాగ్‌ రాఖీ భద్రత చర్యల విన్యాసం తదితర కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు ఉద్యోగులకు, ఉత్తమ శకటాల ప్రదర్శన, స్టాల్స్‌, ఎన్‌సిసి, స్కౌట్‌ పాఠశాలల విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు. పుట్టపర్తి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థులు, ధర్మవరం జీవనజ్యోతి ఇంగ్లీష్‌ మీడియం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాల కదిరి, బుక్కపట్నం డైట్‌ విద్యార్థులు, ధర్మవరం శ్రీ లలిత నాట్యమండలి కళాకారులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఐసిడిఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ, మత్స్యశాఖ, వ్యవసాయం, ఏపీఎంఐపీ ఉద్యానశాఖ, చేనేత, అగ్నిమాపక, డిఆర్‌డిఎ, మెప్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమం, అటవీ, పశుసంవర్ధక శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఇందులో మొదటి ఉత్తమ స్టాల్‌గా వైద్య ఆరోగ్యశాఖ ఎంపిక కాగా రెండవ స్థానంలో వ్యవసాయం, మూడవ స్థానంలో ఉద్యాన శాఖలు ఎంపికయ్యాయి. శకటాలకు సంబంధించి మొదటి ఉత్తమ శకటంగా డిఆర్‌డిఎ ఎంపిక కాగా, ద్వితీయ స్థానం వ్యవసాయ శాఖ, తతీయ స్థానం హౌసింగ్‌, నాలుగవ స్థానంలో దిశా- పోలీసు, ఐదవ స్థానంలో విద్యాశాఖకు చెందిన శకటం ఎంపిక అయ్యాయి. ఉద్యాన శాఖ- ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 201 మంది అర్హులైన రైతులకు రూ.174 లక్షల విలువచేసే డ్రిప్‌, స్ప్రింక్లర్ల పరికరాలు, రూ.127 లక్షల సబ్సిడీతో మంత్రి, కలెక్టర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు.