Nov 04,2023 23:26

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి నవరత్నాలు పథకాల ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేయగలిగామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో సమగ్ర అభివద్ధిని గాలికి వదిలేసిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఏళ్ల తరబడి అనేక సమస్యలు ప్రజలను నిత్యం వేధిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాం నుంచి ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లు కావస్తున్నా జిల్లా సమగ్ర అభివద్ధిపై కనీసం దష్టి సారించలేకపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా రోడ్ల అభివృద్ధి చాలా నామమాత్రంగానే కనిపిస్తుంది. పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తున్న రహదారులపై నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వందలాది మంది ప్రాణాలను వదులుతున్నారు. వేలాదిమంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. రహదారుల మరమ్మత్తులపై జిల్లా ప్రజా ప్రతినిధులు సైతం నోరు ఎత్తడం లేదు. అభివద్ధి కుంటిపడి ప్రభుత్వం పాలనను వెక్కిరిస్తున్నా స్పందించడం లేదు.

సబ్‌ ప్లాన్‌ గ్రామాలను పట్టించుకోరా..?
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న 56 సబ్‌ ప్లాన్‌ గ్రామాలను ఐటిడిఎలో విలీనం చేయాలని అనేకేళ్లుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నా జగన్‌ సర్కారు పట్టించుకోవడం లేదు. సుమారు 35 వేల మంది జనాభా నివశిస్తున్న ఈ ప్రాంతాల్లో అభివద్ధి, మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి హక్కులు పూర్తిగా అణచివేయబడుతున్నాయి. ఇటు షెడ్యూల్‌ గ్రామాలు కాక, అటు ఐటిడిఎ పరిధిలోనికి రాక స్థానిక గిరిజనులు ఎటువంటి హక్కులు పొందలేకపోతున్నారు. అభివద్ధి అనేది కనిపించడం లేదు. అనేకమందికి సంక్షేమ పథకాలు అండడం లేదు. పెదమల్లాపురం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
అన్నదాతల ఆక్రందనలు పట్టవా.?
ఏలేరు ప్రాజెక్టు సాగు నీటి ఆధారంగా జగ్గంపేట, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లోని దాదాపు 53 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. సుమారు 40 వేల మంది రైతులు దీనిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఆధునికీకరణకు రూ.139 కోట్లతో ధర్మవరం వద్ద శంకుస్థాపన చేశారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో 60శాతం పనులు పూర్తయ్యాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేజ్‌ 1, ఫేజ్‌ 2లో రూ.394 కోట్ల నిధులతో అభివద్ధి చేపడుతామని హామీ ఇచ్చినా నేటికి అమలు కాలేదు. దీంతో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో అప్పుల పాలై చివరకు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి చేరారు. సుద్దగడ్డ కాలువ వల్ల గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలు పంటలు సాగవుతున్నాయి. 35 ఏళ్లుగా ఆధునీకరణ లేక ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించక ఈ రెండు మండలాల్లో 20 గ్రామాల ప్రజలు ముంపు బారిన పడుతున్నారు. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. మరోవైపు తుని, కోటనందూరు, రౌతులపూడి, తొండంగి, జగ్గంపేట, గండేపల్లి తదితర మెట్ట ప్రాంతాలతో పాటు కాజులూరు, కరప, తాళ్ళరేవు పెదపూడి మండలాల్లో రైతులు సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా పంటలను నష్టపోతున్నారు. ఇటీవల వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు కాలువల ద్వారా సాగునీరు అందని పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్నాయి. కరువు మండలాలుగా గుర్తించాల్సిన ప్రభుత్వం కనీసం రైతుల బాధలను పరిగణలోకి తీసుకోవడం లేదు. పేదలైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు రెండు దశాబ్దాల కంటే ముందు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పెద్దల చేతుల్లో ఉన్నాయి. వాటి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాకినాడ సెజ్‌ ప్రాంతంలో దాదాపు 15 ఏళ్ల క్రితం రైతుల నుంచి భూములను సేకరించి ఖాళీగా వదిలేశారు. అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం నేటికీ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయింది. వైసిపి ప్రభుత్వం సెజ్‌ ప్రాంతంలో భూములను తిరిగి రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ ఉన్నా పట్టించుకోవడం లేదు. కాకినాడ జిల్లాలో 8 మండలాల్లో జీడి పంటను సాగు చేసే రైతులకు కనీస గిట్టుబాటు ధర తగ్గడం లేదు. పెట్టుబడులు పెరుగుతున్నా మద్దతు ధరలు రాక నష్టపోతున్నారు. వీరి సమస్యలు ఔఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదు.
ముంపులో కాకినాడ నగరం
సుమారు రూ.1000 కోట్ల స్మార్ట్‌ సిటీ నిధులతో అభివృద్ధి చేశామని గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా దాదాపు 4 లక్షలు జనాభా నివసిస్తున్న కాకినాడ నగరం నేటికీ ముంపులోనే కొనసాగుతోంది. వర్షం వస్తే సగం ప్రాంతాలు రోజుల తరబడి ముంపు నీటిలోనే నానుతుంటాయి. దీంతో ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అవుట్‌లెట్ల నిర్మాణం చేపట్టకపోవడం, శాశ్వత పరిష్కారం మార్గాలను అన్వేషించకపోవడం, ఆక్రమణలను తొలగించకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. పాలకులు పట్టించుకోకపోవడంతోనే నగరవాసుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
మడ అడవుల రక్షణ గాలికి
తీర ప్రాంతాలకు రక్షణగా నిలుస్తున్న మడ అడవుల సంరక్షణను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాటిని రక్షించకపోగా ప్రభుత్వం కాకినాడ నగర ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకంలో మడ భూములను ధ్వంసం చేసి చదును చేసే కార్యక్రమం చేపట్టింది. పర్యావరణవేత్తలు చట్టం ద్వారా అడ్డుకోవడంతో ప్రస్తుతం ఆ భూములు ఖాళీగా ఉన్నాయి. మడ మొక్కలను పెంచి పోషించాల్సిందిగా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టు ఆదేశించినా పాలకులకు పట్టడం లేదు. ఇలా జిల్లాలో అనేక సమస్యలు సుదీర్ఘకాలంగా ప్రజలను పట్టిపీడిస్తున్నా వైసిపి ప్రభుత్వం కనీసంగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.