Jul 19,2023 22:26

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్‌ రామకృష్ణారెడ్డి

జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20 వేల కోట్లు అవసరం
సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి
- నంద్యాల పట్టణాభివృద్ధిపై దృస్టి పెట్టాలి
- వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి
- ప్రజాశక్తి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు
ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌

      నంద్యాల జిల్లా నీటి పారుదల సౌకర్యాలున్నా పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని, జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం రూ.20 వేల కోట్లు నిధులు కేటాయించాలని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు సూచించారు. విద్యా, వైద్య సదుపాయాలను మెరుగు పరచాలని, మౌలిక సదుపాయల కల్పన కోసం, తాగు, సాగునీటి పథకాలు, యువత ఉపాధికి పరిశ్రమలు నెలకొల్పాని కోరారు. ప్రజాశక్తి దినపత్రిక 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 'నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధిపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రజాశక్తి స్టాఫ్‌ రిపోర్టర్‌ డి.మౌలాలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య, తదితరులు మాట్లాడారు. వారి మాటల్లో.....

జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాల అవసరం
- రామకృష్ణారెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్‌
నంద్యాల జిల్లా అయినప్పటికీ నేటికీ జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్‌కు శాశ్వత కార్యాలయం లేదు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు ఉన్నా పూర్తి స్థాయిలో నీటి వినియోగం లేదు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.

జిల్లా అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయించాలి
- టి. రమేష్‌ కుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి.
ఆత్మకూర్‌-దోర్నాల మధ్య ఎక్కువగా అడవుల్లో వెదురు ఉత్పత్తి అవుతుంది. పేపర్‌ మిల్‌ ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రంలో ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే మంచి వైద్యం అందుతుంది. జిల్లాలో మైనింగ్‌, ఖనిజ సంపద ఎక్కువ కాబట్టి మైనింగ్‌ యూనివర్సిటీతోపాటు, మైనింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావాలి. నంద్యాల పట్టణంలో తాగునీటి శాశ్వత పరిష్కారం చూపాలి. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయించాలి.

నంద్యాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
శ్రీనివాసమూర్తి- న్యాయవాది
నంద్యాల జిల్లా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలి. దేవాలయాలు, బెలూంకేవ్స్‌ తదితర వానిటి ఆధునీకరించి సౌకర్యాలను మెరుగు పరచాలి. నంద్యాల ఏరియాలో సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ అవి కేవలం రైల్వే వారికే లాభాన్ని చేకూరుస్తున్నాయి. నంద్యాలలోవరి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రైతులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి.

అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
- దస్తగిరి పర్ల, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షులు
కర్నూలు జిల్లా కంటే నంద్యాల అన్ని విధాలుగా బాగుంది. జిల్లా కేంద్రం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. నంద్యాలలో చిన్న చెరువు దగ్గరి నుండి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంది. జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించి ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

పట్టణాభివృద్ధి ప్రత్యేక చర్యలు అవసరం
- కె.శ్యామ్‌ సుందర్‌ లాల్‌ కౌన్సిలర్‌ , సీనియర్‌ జర్నలిస్ట్‌
ప్రజాశక్తి అంటేనే ప్రజల పక్షం అని అర్థం. జర్నలిస్టుల ఉద్యమంలో ప్రజాశక్తి, విశాలాంధ్ర ముందున్నాయి. నంద్యాలలో చాలా వనరులు ఉన్నాయి. కర్నూలు జిల్లా కంటే త్వరగా నంద్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. రైతులు ఎక్కువగా ఉన్నారు. మూడు ప్రధాన కాల్వలు ఉన్నాయి. కానీ మనం పూర్తిగా నీటిని వాడుకోలేని స్థితిలో ఉన్నాం. పట్టణాభివృవృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

పరిశ్రమలతోనే జిల్లా అభివృద్ధి
రంగనాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి
నంద్యాల జిల్లా కాకముందే ఇండిస్టియల్‌గా పేరుగాంచింది నంద్యాలలో షుగర్‌ ఫ్యాక్టరీ, నూలు మిల్లు ఉండేవి. ఎంతోమంది కార్మికులు వాటిలో పని చేసే వారు. షుగర్‌ ఫ్యాక్టరీ, నూలు మిల్లు మూసి వేయడంతో ఉపాధి కోల్పోయారు. ఖనిజ సంపద, అటవీ ప్రాంతాలు, నీటి సౌకర్యం కలిగి ఉంది. మెడికల్‌ కాలేజీ తో పాటు న్యాయ కళాశాల, యూనివర్సిటీ వంటివి కూడా జిల్లాలో ఏర్పాటు చేయాలి. మొదటి నుండి రైల్వే సౌకర్యం ఉంది కానీ ప్రధాన పట్టణాలకు వెళ్లడానికి నంద్యాల మీదుగా రైళ్లు నడిచే విధంగా చూడాలి. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి.

వ్యవసాయాధారిత పరిశ్రమలు రావాలి
పి.చంద్రయ్య ప్రజాశక్తి ఎడిషన్‌ఇన్‌ఛార్జి
నంద్యాల ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. వ్యవసాయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలను, అధికారులను నియమించాలి. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి.విద్య, వైద్యానికి ప్రభుత్వ బడ్జెట్‌ పెంచాలి. యువత ఉపాధికోసం స్కిల్‌ డెవలఫ్‌ , ఐటి సెంటర్‌ ఏర్పాటు చేయాలి. మహిళలకు, ఎస్‌సి, ఎస్‌టిల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి.

కొత్త పరిశ్రమలు రావాలి
చింతలయ్య , కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు
గతంలో కాటన్‌ మిల్లులు ఉండేవి.మూతపడ్డాయి. చాలా మందికి ఉపాధి పోయింది. రోడ్డుపక్కన చిన్ని గుడిసెలు వేసుకొని ఉండేవారిని దూరం పంపారు. వారికి ఇళ్లస్థలాలు, ఇల్లు నిర్మిస్తామని మోసం చేశారు. అన్ని పార్టీలు ఉద్యమాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం మొండి వైఖరితో మెడికల్‌ కాలేజీ కట్టడం దుర్మార్గమైన చర్య. ఉపాధికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.

సాగునీటి వినియోగంలో రాయలసీమకు అన్యాయం
రామచంద్ర రెడ్డి ,రాయలసీమ సాగునీటి సాధన సమితి జిల్లా ఉపాధ్యక్షులు.
సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగంలో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. నీటి వాటా సద్వినియోగానికి స్థానికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పోరాటం చేయాలి. ప్రాజెక్ట్‌ ల నిర్మాణాల్లో పాలకులు దష్టి పెట్టాలి. . సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే సాగు నీటి సమస్య ఉండదు.

జిల్లా లో టూరిజం అభివద్ధికి కషి చేయాలి ..
కె. మహమ్మద్‌ గౌస్‌ , పట్టణ కార్యదర్శి సిఐటియు
ప్రధాన నగరాల నుండి జిల్లాకు రైలు సౌకర్యం కల్పిస్తే టూరిజం మరింత అభివృద్ధి చెందుతుంది. జిల్లా లో షుగర్‌ పరిశ్రమ, నూలు మిల్లు, చిన్న చిన్న ఆయిల్‌ మిల్లులు మూత పడటంతో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. కొత్త పరిశ్రమ లు ఏర్పాటు చేయాలి. ఉన్న సిమెంట్‌ పరిశ్రమాల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలి.

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
మాదాల శ్రీనివాస్‌ సాహితీస్రవంతి
నంద్యాల వ్యవసాయదారిత ప్రాంతం గా అభివద్ధి చెందడానికి కారణం బ్రిటిష్‌ వారు నిర్మించిన కేసీ కెనాల్‌ కాల్వ నంద్యాల కు ఒక వరంగా భావించవచ్చు. జిల్లాకు ఎస్‌ఆర్‌బిసి తెలుగు గంగ వంటి జల వనరులు ఉన్నాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పించాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలి.

     ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సురేష్‌, ప్రజాశక్తి నంద్యాల డివిజన్‌ ఇంచార్జ్‌ మల్లికార్జున, సర్క్యులేషన్‌ ఇంచార్జ్‌ శివ, ప్రజాశక్తి విలేకరులు సోమశేఖర్‌, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.