ప్రజాశక్తి-ఆలూరు
వెనకబడిన ఆలూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా పోరాడాలని వక్తలు కోరారు. శనివారం వాసవీ కల్యాణ మండపంలో ప్రజాశక్తి 43వ వార్షికోత్సవ సందర్భంగా రౌండ్‌టేబుల్ సమావేశం డివిజన్ ఇన్‌ఛార్జీ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు సబ్ జైలును పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా సబ్ జైలు లేకపోవడంతో నిరుపేదలైన కక్షిదారులు సుదూర ప్రాంతాలు ఆదోని, పత్తికొండ సబ్ జైలుకు వెళ్లి రావడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అనంతరం సిపిఐ జిల్లా నాయకులు భూపేష్ మాట్లాడారు. వేదవతి ప్రాజెక్టు సాధన కోసం వామపక్షాల పోరాటం మరువలేనిదన్నారు. వేదవతి నిర్మాణంలో పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. 8 టిఎంసిల ప్రాజెక్టును 3 టిఎంసిలకు కుదించడం రైతులను దగా చేయడమేనని విమర్శించారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ... పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆలూరు నియోజకవర్గం వెనుకబడిందని తెలిపారు. విద్యారంగం అభివృద్ధి చెందినప్పుడే ప్రజల్లో చైతన్య వస్తుందన్నారు. సిపిఎం నాయకులు షాకీర్ మాట్లాడుతూ... నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మద్దతు ధరతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కురవల్లి చెరువును ఎస్‌ఎస్ ట్యాంకుగా మారిస్తే ఆలూరు పట్టణానికి నీటి సమస్య తీరుతుందన్నారు. భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ నాయకులు జనార్ధన్ మాట్లాడుతూ... ఆలూరు మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తే రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. హాలహర్వి మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి మండల కన్వీనర్ అశోక్, తెలుగు యువత అధికార ప్రతినిధి సురేంద్ర, టిడిపి నాయకులు వెంకటేశ్వర రెడ్డి, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు మనోహర్, జనసేన మండల నాయకులు ఛత్రపతి, యశోద, ఎంఆర్‌పిఎస్ మండల అధ్యక్షులు ఎల్లప్ప, యుటిఎఫ్ నాయకులు బసవరాజు, రాఘవేంద్ర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మాధవరావు, డివైఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, ప్రజాశక్తి జిల్లా ఇన్‌ఛార్జీ రాజు, విలేకరులు కృష్ణ, నాగరాజు, రవి, కాశీం, మురళీ, వీరభద్రగౌడ్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా నాయకులు భూపేష్










