ప్రజాశక్తి - గోనెగండ్ల
కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో నెల రోజులపాటు చేపట్టే ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.ఆనంద్‌బాబు కోరారు. మంగళవారం గోనెగండ్లలో దండు ఖాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు మాట్లాడారు. పాలక పక్షాలు ప్రజల సమస్యలపైనా, ప్రాంతాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టేలా ఉద్యమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ ప్రజా ఉద్యమంలో అన్ని తరగతుల ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. మండలంలోని గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలను ప్రధాన అజెండా చేయడంలో భాగంగా జులై 5 నుంచి 14 వరకు సర్వేలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలను సచివాలయాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. 15 నుంచి 20 దాకా జీపుజాతాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి, 26 నుంచి 31 వరకు వందలాది మందితో ఆదోని నుంచి కర్నూలు కలెక్టరేట్ వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. నీటి కోసం, నిధుల కోసం, వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించే ఈ ప్రజా ఉద్యమంలో అందరూ భాగస్వామ్యమై జయప్రదం చేయాలని కోరారు. అనంతరం జిల్లాలో నిర్వహించే మహా పాదయాత్రకు సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు. మండల నాయకులు కరుణాకర్, దేవేంద్ర, దేవదాసు, మారేష్ పాల్గొని మాట్లాడారు. నందవరం మండలం రాయచోటి గ్రామంలో స్వామిదాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.గురుశేఖర్, జిల్లా నాయకులు రంగప్ప, మండల నాయకులు దేవపుత్ర, మల్లన్న, దస్తగిరి, దేవదాసు, శ్రీరాములు పాల్గొన్నారు.
గోనెగండ్లలో కరపత్రాలు విడుదల చేస్తున్న నాయకులు










