Oct 26,2023 21:04

ఎసిబి అధికారులకు పట్టుబడిన జూనియర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌

జిల్లా రిజిస్టార్‌ కార్యాలయంలో ఎసిబి దాడులు
- లంచం తీసుకుని పట్టుబడిన జూనియర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     నంద్యాల జిల్లా రిజిస్టార్‌ కార్యాలయంలో ఎసిబి అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. బాధితుడి నుండి రూ.5 వేలు లంచం తీసుకుంటూ జిల్లా రిజిస్టార్‌ డ్రైవర్‌ ప్రకాష్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల మేరకు.. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన రైతు చిన్నప్ప తన 3.20 ఎకరాల భూమిని చుక్కల భూమి జాబితా నుండి తొలగించాలని ఈ ఏడాది జూలై 12న జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామున్‌ను కలిసి అభ్యర్థించాడు. స్పందించిన జిల్లా కలెక్టర్‌ చిన్నప్ప పొలాన్ని చుక్కల భూమి జాబితా నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో రైతు చిన్నప్ప జిల్లా రిజిస్టార్‌ ఆఫీసు జిల్లా రిజిస్టార్‌ను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ జూనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి రైతును పిలిచి విషయం అడిగారు. ఈ పని పూర్తి చేయాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని జూనియర్‌ అసిస్టెంట్‌ డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వలేనని, పొలాన్ని నమ్ముకుని కష్టపడే వాడినని చిన్నప్ప ప్రాధేయపడ్డాడు. జూనియర్‌ అసిస్టెంట్‌ ఒప్పుకోలేదు. రైతు చిన్నప్ప ఎసిబి అధికారులను అశ్రయించాడు. పథకం ప్రకారం 20 వేల రూపాయల లంచం మాత్రమే ఇవ్వగలనని రైతు చిన్నప్ప చెప్పగా జూనియర్‌ అసిస్టెంట్‌ అంగీకరించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేయగా ఆఫీసు ఎదుట ఉన్న కూల్‌ డ్రింక్స్‌ షాపు వద్దకు డ్రైవర్‌ ప్రకాష్‌ రెడ్డి వస్తాడని, అడ్వాన్స్‌గా రూ.5 వేలు ఇవ్వాలని చెప్పాడు. ఈ మేరకు డబ్బు తీసుకొని ఆఫీసులోకి వెళ్లిన ప్రకాష్‌ రెడ్డిని ఎసిబి డిఎస్‌పి. సప్తగిరి, సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ జూనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి గతంలో అవుకులో కూడా లంచం తీసుకుంటూ దొరికాడని చెప్పారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి పై, డ్రైవర్‌ ప్రకాష్‌ రెడ్డిలపై కేసు నమోదు చేశామని, వీరిద్దరిని రేపు ఎసిబి కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.