
ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవరణంలో సోమవారం ఓపెన్ హౌస్ (ఆయుధాల ప్రదర్శన), సాంకేతిక పరమైన వస్తువుల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఈనెల 21 నుండి 31 వరకు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీసులు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు .అందులో భాగంగా సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్(ఆయుధాల ప్రదర్శన) కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల ఆయుధాలు, పోలీసు పరికరాలు, వాటి పనితీరు గురించి జిల్లా ఎస్పీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఆనంతరం ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా డాగ్ స్క్వాడ్ ప్రదర్శన ఆకట్టుకుంది. సంఘటనలు జరిగినప్పుడు ఆనవాళ్లను ఏ విధంగా పసి కడతాయో వంటి దృశ్యాలను వాటి శిక్షకులు వాటి ద్వారా ప్రదర్శించారు. ముఖ్యంగా డాగ్స్ ఐరన్ రింగ్ రౌండ్ లలో జంపింగ్ చేస్తూ వెళ్లిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోలీస్ పాత్రపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఏపీ ఆర్ జెసి కోడిగునహళ్లి రిటైర్డ్ ప్రిన్సిపాల్ వాసుదేవ రెడ్డి అమరులైన పోలీసుల త్యాగాల గురించి వివరించారు. ఈకార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ విష్ణు , డీఎస్పీ లు వాసుదేవన్ , కెవిఆర్ ప్రసాద్, ఎఆర్ డీఎస్పీ విజరుకుమార్ , ఎస్‌బి సిఐ రవీంద్రారెడ్డి, సిఐలు, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.